టిజి వెంకటేష్ మాటలు: సీమాంధ్ర వ్యూహం?
హైదరాబాద్: "కావాలంటే రాసుకోండి. ఎన్నికలయ్యే దాకా విభజన ప్రక్రియ సాగదు. సందర్భం కోసం ఎదురుచూస్తున్నాం. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలమందరం సమష్టిగా రాజీనామా చేస్తాం. మంత్రి పదవినే కాదు ఎమ్మెల్యే పదవినీ వదులుకుంటాం. ఢిల్లీ పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు వేచి చూస్తున్నాం'' అని తెలిపారు. టిజి వెంకటేష్ ఆ మాటలు అనడంలోని ఆంతర్యమేమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వభజనను అపించడానికి ఎంత దూరం పోతారనేది కూడా ఆసక్తిగానే మారింది. ఆదివారం టిజి వెంకటేష్ నివాసంలో సమావేశమైన సీమాంధ్ర మంత్రులు రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్ఠానాన్ని ఒప్పించే శక్తి తమకు ఉందని టిజి వెంకటేష్ అన్నారు. మిగతా పార్టీలు కూడా స్పందించాలని, ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రకటనకు అన్ని పార్టీలూ కారణమేనన్నారు. ఇందులో ప్రతిపక్ష నాయకుడి పాత్ర కీలకమని, చంద్రబాబు ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు.

కారణం ఏదైనా ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు యూ టర్న్ తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూ మిగతా పార్టీలూ ఆ దిశలో ముందుకు అడుగులు వేయాలని కోరారు. అసెంబ్లీని రద్దు చేస్తే సాంకేతికంగా తలెత్తే సమస్యలు, బిల్లు పెట్టవచ్చా లేదా అన్న అంశాలపై రాజ్యాంగ నిపుణులతో సంప్రదిస్తామని చెప్పారు.
సమైక్యాంధ్ర విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకపోతే తీవ్ర నిర్ణయాలను తీసుకోవాల్సిందేనని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టిజి వెంకటేష్ ఆ మాటలు అన్నట్లు చెబుతున్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ నివాసంలో ఆదివారం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మహీధర్ రెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి, వట్టి వసంతకుమార్, సి.రామచంద్రయ్య తదితరులు భేటీ అయ్యారు.
అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా కేంద్రం పట్టుదలకు పోతే ఏమి చేయాలన్న అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. సభ విజయవంతం కావడాన్ని హర్షిస్తూనే హోం మంత్రి షిండే చేసిన ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే కేబినెట్ నోట్ పంపుతామని చెప్పడం ద్వారా విభజన విషయంలో తామేమీ వెనక్కి తగ్గడం లేదన్న సంకేతాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకే కేంద్రం మొగ్గు చూపితే సీమాంధ్ర నేతలు కూడా అదే స్థాయిలో కఠినంగా వ్యవహరించాలని, సీఎం కిరణ్ సహా మంత్రులమంతా రాజీనామాలు చేయాల్సిందేనని నిర్ణయించారు. సామూహిక రాజీనామాలతోపాటు సీమాంధ్రలో కొత్త పార్టీ పెట్టే విషయాన్ని కూడా ఆలోచించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తీర్మానం వీగినా కేంద్రం విభజనకు మొగ్గు చూపితే రాజీనామాలు చేయక తప్పని అగత్యం ఏర్పడుతుందని తెలిపారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న నాయకుడిగా ప్రస్తుతం సీఎం కిరణ్‌ను సీమాంధ్ర ప్రజలు విశ్వసిస్తున్నారని, అందువల్ల ఆయనే నాయకత్వం వహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తొందరగా జరిగినా, 2014 ఎన్నికల వరకు ఆగినా సీమాంధ్ర ప్రాంతానికే నష్టమని, విభజన ప్రక్రియపై ఏమీ తేల్చకుండా నాన్చితే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని మంత్రి వట్టి వసంతకుమార్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాత మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను ఆమోదింపచేసుకుంటామని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు.












Click it and Unblock the Notifications