ఖైరతాబాద్ గణేశుడు: గవర్నర్ దంపతుల పూజలు
హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు కొలువు దీరాడు. హైదరాబాదులోని ఖైరతాబాద్‌లో గోచతుర్ముఖ వినాయుడు కొలువు దీరాడు. ఖైరతాబాద్ విగ్రహానికి హైదరాబాదులో ప్రత్యేకత ఉంది. ఇదే నగరంలోని అతి పెద్ద విగ్రహంగా కొనసాగుతూ వస్తోంది. ఈ వినాయకుడికి గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం పూజలు నిర్వహించారు.
గవర్నర్ దంపతులకు పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ శాలువా కప్పి ఆహ్వానం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని గవర్నర్ సత్కరించారు.

ప్రతి యేటా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది గోనాగ చతుర్ముఖ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఓ వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరో వైపు శక్తి మాత కొలువు దీరారు. భారీ రూపంలో దర్శనమిచ్చే గణనాథుడికి అంతే స్థాయిలో లడ్డూను తయారు చేశారు. నాలుగు వేల కేజీల లడ్డూను వినాయకుడి చేతిలో పెట్టారు.
ఖైరతాబాద్ వినాయకుడి దర్శించేందుకు నగరవాసులే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిర్వహకులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నగరమంతటా గణేశుడి విగ్రహాలు కొలువు దీరాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు. గణేశుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.












Click it and Unblock the Notifications