ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్: 13 మంది విద్యార్థుల డీబార్
ఆదిలాబాద్: కుమురంభీ అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మాస్ కాపీయింగ్ జరిగింది. ఈ క్రమంలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 13 మంది విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గురువారం ఉదయం గణితం 1 బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలకు 91 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాలేజీ సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పరీక్షలు ప్రారంభం కాగా.. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటర్మీడియట్ బోర్డ్ తనిఖీ బృందం పరీక్షా కేంద్రాన్ని సందర్శించింది. విద్యార్థులను తనిఖీ చేయగా.. 13 మంది విద్యార్థుల వద్ద నకల్ చిట్టీలు లభ్యమయ్యాయి.

దీంతో ఆ 13 మంది విద్యార్థులను పరీక్షలు రాయకుండా డీబార్ చేశారు అధికారులు. అంతేగాక, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఇన్విజిలేటర్లపై చర్యలకు ఆదేశించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపించామని కాలేజీ సిబ్బంది చెబుతున్నప్పటికీ.. 13 మంది విద్యార్థుల వద్ద చిట్టీలు దొరకడం గమానర్హం. ఏకంగా 13 మంది డీబార్ కావడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలలో ప్రారంభమైన ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌లో ముగిశాయి. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 62.85 శాతం, రెండో సంవత్సరం ఫలితాల్లో 67.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్.. సెకండియర్‌లో ములుగు జిల్లాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. బాలికలు ప్రథమ సంవత్సరం 68.68 శాతం, బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ద్వితీయ సంవత్సరం బాలికలు 71.57 శాతం, బాలురు 55.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలో జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications