Albendazole : ఏపీలో అన్ని స్కూళ్లలో ఈ నెల 14న అల్పెండజోల్ మాత్రల పంపిణీ..
ఏపీలోని విద్యార్ధుల్లో రక్తహీనతను అరికట్టేందుకు ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ప్రభుత్వం ఆల్పెండజోల్ మాత్రల్ని పంపిణీ చేయబోతోంది. అందరు విద్యార్ధులకు దీన్ని అందించేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కీలక ఉత్తర్వులు జారీచేశారు.
ఈనెల 14న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ప్రకటించారు. ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ల వయసు వారికి ఆల్బెండజోల్ మాత్రల్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగు మాత్రల పంపిణీ ఉంటుందన్నారు. దీన్ని విద్యార్ధులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పిల్లల్లో నులిపురుగులు, రక్తహీనత నివారణకు ఆల్బెండజోల్ మాత్రను తప్పనిసరిగా వేసుకోవాలని ఆరోగ్యశాఖ కమిషనర్ ఓ ప్రకటనలో కోరారు. పిల్లలు తిన్న ఆహారం వంటపట్టేందుకు కూడా ఈ మాత్ర ఎంతగానో పనిచేస్తుందన్నారు. మధ్యాహ్నం భోజనం చేశాక ఒక మాత్రను ఒకసారి మాత్రమే వేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం తగు సూచనలు చేస్తోంది. విద్యార్ధుల్లో నులిపురుగుల్ని నివారించడం ద్వారా భావిభారత పౌరుల్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications