గిన్నిస్ రికార్డుపై రాద్ధాంతమా..? కార్మికుల శ్రమకు అవమానం..! జగన్ కు దేవినేని కౌంటర్

అమరావతి : పోలవరానికి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కడాన్ని అందరూ స్వాగతిస్తుంటే.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించడం సరికాదన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వందలాది కార్మికులు, ఇంజనీర్లు 24 గంటలు కష్టపడి విజయం సాధిస్తే ప్రశంసలు కురిపించాల్సింది పోయి వారి శ్రమను అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు.
తెలుగోడి సత్తాకు అభినందల జల్లు కురుస్తుంటే.. జగన్ ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా రోజు వ్యవధిలో 32,315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోయడం చాలా గొప్ప విషయమన్నారు.

రికార్డులతో నాటకాలు కాదు..! పోలవరం పరుగులు
గిన్నిస్ రికార్డు పేరుతో టీడీపీ ప్రభుత్వం నాటకమాడిందంటూ తన అవినీతి పత్రికలో విషం చిమ్మడం దుర్మార్గమని మండిపడ్డారు దేవినేని. రికార్డుల పేరుతో నాటకం ఆడాల్సిన పని తమకు లేదన్నారు. అడ్డంకులెన్ని ఎదురైనా పోలవరం పనులను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. పోలవరం గిన్నిస్ రికార్డు పట్ల దేశమంతా హర్షం వ్యక్తం చేస్తుంటే.. జగన్ కు మాత్రం అవినీతి జరిగినట్లు కనిపిస్తోందా అంటూ ఎద్దేవా చేశారు.

సీఎం కుర్చీపై కలలు కనడం తప్ప మరేమీ తెలియదా?
చంద్రబాబు నాయుడిని తిట్టకుండా జగన్ కు క్షణం గడవదని ఆరోపించారు దేవినేని. సీఎం కుర్చీపై కలలు కనడం తప్ప ఆయనకు ఇంకేమీ తెలవదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పీఠంపై ఆలోచించకుండా ఆయనకు రోజు గడవదని ఎద్దేవా చేశారు. నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే ధోరణి కనబరిస్తే జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అటు కేంద్రం జోలికి వెళ్లకుండా చీటికిమాటికి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడం వెనుక ఆంతర్యమేంటని వ్యాఖ్యానించారు.

మోడీ, కేసీఆర్ తో జట్టు.. అందుకే టీడీపీపై కుట్ర
అటు ప్రధాని మోడీతో, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ జతకట్టారని ఆరోపించారు. వారిద్దరితో లాలూచీ పడి విష రాజకీయాలు చేస్తూ ఇక్కడి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఫైరయ్యారు. మోడీ, కేసీఆర్ దర్శకత్వంలో టీడీపీ ప్రభుత్వంపై జగన్ కుట్రలు చేస్తున్నారని.. అలాంటివాళ్లు ఎంతమంది అడ్డొచ్చినా చంద్రబాబు పోలవరం పూర్తిచేయడం ఖాయమన్నారు. రైతాంగానికి పోలవరం కానుకగా ఇవ్వడమే చంద్రబాబు ధ్యేయమన్నారు.
చంద్రబాబు ప్రణాళికలతోనే చాలా చోట్ల భూగర్భజలాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. పోలవరం పనుల్లో అవినీతి జరుగుతోందంటూ గగ్గోలు పెడుతున్న జగన్ కు లెక్కలు తెలియదని మండిపడ్డారు. 10,449 కోట్ల రూపాయలతో పనులు చేస్తే.. 25వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించడం అసత్య ప్రచారం కాకపోతే మరేంటని ప్రశ్నించారు.