ఏపీలో బీజేపీ సర్కార్.. జనసేనతో కలిసి ఏర్పాటు.. జీవీఎల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బీజేపీ ఫుల్ జోష్‌లో ఉంది. అదే ఉత్సాహం తెలుగు రాష్ట్రాల్లో కూడా తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఏపీలో తమకు అధికారం తథ్యం అనే ధీమాతో ఉంది. ఏపీలో ఎన్నికల గురించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న యూపీ గెలిచాం, నేడు ఏపీ గెలుస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2024లో ఏపీలో రాబోయేది బీజేపీ-జనసేనల ప్రభుత్వమేనని జీవీఎల్ నరసింహారావు విశ్వాసం వ్యక్తం చేశారు.

అధికారం తథ్యం..
జనసేనతో కలిసి అడుగులు వేస్తూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామని ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరిస్తుందని చెప్పారు. బీజేపీ, జనసేనకు చెందిన కీలక నేతలంతా సమావేశమై బలమైన రాజకీయ వ్యూహాలను తయారు చేస్తామని తెలిపారు. విజయవాడలోని తన నివాసం వద్ద నిర్వహించిన హోలీ వేడుకల్లో జీవీఎల్ పాల్గొన్నారు. రాయలసీమ సమస్యలకు సంబంధించి కడపలో శనివారం రణభేరిని నిర్వహించనున్నట్టు జీవీఎల్ తెలిపారు.

జోష్
నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరవేయడంతో ఈ హోలీ తమకు ఎంతో స్పెషల్ అని జీవీఎల్ అన్నారు. ఇదే ఉత్సాహంతో పని చేసి 2024లో తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి అసహనం ఎక్కువ అవుతోందన్న జీవీఎల్.. దాన్ని తగ్గించుకోకపోతే తొందరలోనే గద్దె దిగడం ఖాయమని హెచ్చరించారు జీవీఎల్. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తీవ్రం చేస్తామని జీవీఎల్ తెలిపారు.

నిర్వీర్యం
వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తోందని జీవీఎల్ మండిపడ్డారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని రేపటి కడప సభలో వివరిస్తామని చెప్పారు. ప్రధాని మోడీ పాలన చూసి అంతా భేష్ అంటున్నారని జీవీఎల్ అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అందుకోసం నియోజకవర్గాల వారీగా భారీ సభలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వం పాలనను ప్రజల దగ్గర ఎండగడతామని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రాజెక్టుల గేట్లు మెయింటైన్ చేయడానికి నిధులు, సిబ్బందిని కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాయలసీమ నుంచి ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా.. సాగు విస్తీర్ణం 19 లక్షల ఎకరాలు దాటలేదని చెప్పారు. రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టులు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.












Click it and Unblock the Notifications