తుళ్లూరులో రైతులు-పోలీసుల మధ్య తోపులాట
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'జైభీమ్' పార్టీ వ్యవస్థాపకుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా పాదయాత్ర చేశారు. ఆయనకు సంఘీభావం తెలియజేసేందుకు అంబేడ్కర్ స్మృతివనం వద్దకు రైతులు బయల్దేరగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద భారీసంఖ్యలో పోలీసులు మోహరించారు.
శిబిరం వెనుకవైపు పొలాల నుంచి వెళ్లేందుకు కొందరు రైతులు యత్నించగా వారిని పోలీసులు నిలువరించారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు వారిని వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు. పొలాల వెంట వెళ్తున్నవారితో పాటు శిబిరం నుంచి బయటకు వచ్చిన మరికొందరు రైతులను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య శిబిరం దగ్గర తోపులాట జరిగింది. పోలీసుల వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జడ శ్రావణ్ పాదయాత్రకు అనుమతి లేదు: డీఎస్పీ
రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందని.. జడ శ్రావణ్‌కుమార్ పాదయాత్రకు అనుమతివ్వలేదని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు చెప్పారు. వైసీపీ నాయకులు చేపట్టిన బైక్ ర్యాలీకి కూడా అనుమతి లేదని, ఉద్రిక్తతలు తలెత్తకుండా అందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు.
ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన అర్హులైన పేదలకు రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్ లో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలివ్వాలని నిర్ణయించింది. ఈమేరకు రెండు జిల్లాల్లోని ఉన్నతాధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆర్-5 జోన్ లో ఎలక్ట్రానిక్ సిటీ నిర్మాణం జరగాల్సి ఉందని, తాము స్వచ్ఛందంగా భూములిచ్చింది రాజధాని నిర్మాణం కోసమేనని అన్నదాతలు చెబుతున్నారు. ఇళ్ళస్థలాలివ్వాలనుకుంటే ప్రభుత్వం ఆర్-3 జోన్ పరిధిలో ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో రైతుల అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వారంలో విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications