Humanity: కర్ణాటక కరోనా పేషెంట్లకు అనంతపురంలో ట్రీట్‌మెంట్: ఆసుపత్రులకు తాకిడి
అనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ ఆక్సిజన్ కొరత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు అవసరమైన చికిత్సను అందించడానికి చాలినన్ని ఆసుపత్రులు అందుబాటులో ఉండట్లేదు. ఐసీయూలు, పడకలు, వెంటిలేటర్ల కొరత వెధిస్తోంది. ఏ రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ పరిస్థితుల్లో తమ ప్రజలను తాము కాపాడుకోవడానికి అన్ని రాష్ట్రాలు ప్రాధాన్యత ఇస్తోన్నాయి. ఉమ్మడి రాజధానే అయినప్పటికీ హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడానికి ఏపీలోని అంబులెన్సులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి వెనుకాడింది.

అంబులెన్సులపై ఆంక్షల్లేవ్..
బెంగళూరులో ఆసుపత్రులు లభంచక ప్రాణాపాయ స్థితికి చేరుకున్న పేషెంట్లు సైతం పొరుగునే ఉన్న అనంతపురం జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్ణాటకకు చెందిన కోవిడ్ పేషెంట్లు అనంతపురం జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి తాము ఎలాంటి నిర్బంధాన్ని గానీ, ఆంక్షలను గానీ విధించట్లేదని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల బెంగళూరుకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఒకరు అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.

సరిహద్దు పట్టణ ప్రజలు అనంతకు
గుత్తికి చెందిన ఓ వ్యాపారి.. కర్ణాటకకు చెందిన తన సమీప బంధువుకు అనంతపురం జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. కర్ణాటక-అనంతపురం జిల్లా సరిహద్దులకు ఆనుకుని ఉండే పావగడ, మధుగిరి, చెల్లకెరె, గౌరిబిదనూరు, బాగేపల్లి, గుడిబండ, శిర, హిరియుూర్ వంటి పట్టణాలకు చెందిన కోవిడ్ పేషెంట్లు అనంతపురం జిల్లాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక నుంచి అనంతపురం జిల్లాలో ప్రవేశించే ఏ ఒక్క అంబులెన్స్‌ను కూడా తాము ఆపట్లేదని జిల్లా పోలీసు అధికారులు స్పష్టం చేస్తోన్నారు.

చికిత్స ఖర్చూ తక్కువే..
రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నివసించే ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం అటుఇటు రాకపోకలు సాగిస్తుంటారు. సాధారణ చికిత్స కోసం కూడా ఆయా పట్టణాలకు చెందిన ప్రజలు అనంతపురం జిల్లా ఆసుపత్రులకు తరలివస్తుంటారు. బెంగళూరు, బళ్లారి వంటి నగరాలతో పోల్చుకుంటే.. అనంతపురం జిల్లాలోని ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు అయ్యే ఖర్చు కూడా తక్కువేనని పేషెంట్ల బంధువులు చెబుతున్నారు. జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచరుకుని పలుచోట్ల కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా చికిత్స కర్ణాటక పేషెంట్లు కూడా చికిత్స అందిస్తున్నట్లు గంధం చంద్రుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications