అకాల మరణాలు- ఏపీలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన యూనివర్శిటీలో శ్రీధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమాన్ని నిర్వహించనున్నారు.
అనంతపురం: అకాల మరణాలు సంభవిస్తోన్న నేపథ్యంలో అనంతపురంలోని ప్రతిష్ఠాత్మక శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. యూనివర్శిటీలో పని చేస్తోన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొంతకాలంగా అకాల మరణాల బారిన పడుతున్న నేపథ్యంలో శ్రీధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమాన్ని జరిపించాలని నిర్ణయించింది.
ఈ నెల 24వ తేదీన యూనివర్శిటీ ప్రాంగణంలోని క్రీడా వేదికలో ఈ శాంతి హోమాన్ని నిర్వహించ తలపెట్టింది. ఈ మేరకు యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఓ సర్కులర్ ను జారీ చేశారు. యూనివర్శిటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, హఠాన్మరణాల బారిన పడకుండా ఉండటానికి ఈ శాంతి హోమాన్ని జరిపించనున్నట్లు ఈ సర్కులర్ లో పొందుపరిచారు.

ఈ శాంతి హోమాన్ని జరిపించడానికి అయ్యే ఖర్చును యూనివర్శిటీ అధికారులు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నుంచి చందాల రూపంలో వసూలు చేస్తోన్నారు. టీచింగ్ స్టాఫ్ ఇచ్చే కనీస చందా మొత్తాన్ని 500 రూపాయలుగా నిర్ధారించారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కు 100 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మొత్తాన్ని ఈ నెల 21వ తేదీ నాటికి వసూలు చేయాల్సి ఉంటుందని ఎస్ కే యూనివర్శిటీ రిజిస్ట్రార్ సూచించారు. నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శి శాంతిలింగం, డిపార్ట్ మెంట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ కృష్ణుడుకు చందాల మొత్తాన్ని అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.

కాగా- యూనివర్శిటీ అధికారులు నిర్వహించ తలపెట్టిన ఈ ధన్వంతరి మృత్యుంజయ శాంతి హోమం పట్ల నిరసనలు వ్యక్తమౌతోన్నాయి. విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విశ్వవిద్యాలయం అంటే అన్ని కులాలు, మతాల విద్యార్థులకు ప్రతీకగా భావిస్తారని, అలాంటి చోట ఒక మతాన్ని ప్రతిబింబించేలా హోమాన్ని నిర్వహించడం సరికాదంటూ విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.

ఈ సర్కులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు. మత ప్రాతిపదికన జరిగే ఇలాంటి కార్యక్రమాలను యూనివర్శిటీ ఆవరణలో నిర్వహించడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేస్తోన్నారు. దీన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనితో యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి. సజావుగా శాంతి హోమం జరగడానికి వీలుగా యూనివర్శిటీ అధికారులు పోలీసులను ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications