ఎర్రటి ఎండలో... ఉపాధి కూలీలతో కలిసి పలుగు చేతపట్టిన కలెక్టర్... మట్టి పనిచేస్తూ...
అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. కలెక్టర్‌గా సమీక్షలు,అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు,జరగాల్సిన పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మంచి కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందిన గంధం చంద్రుడు... తాజాగా ఉపాధి హామీ కూలీలతో కలిసి తానూ పలుగు చేత పట్టారు. వారితో కలిసి ఆయన కూడా మట్టి తవ్వుతూ కూలీల్లో ఉత్సాహం నింపారు.

కాళ్లకు చెప్పులు లేకుండానే...
ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను కలెక్టర్ చంద్రుడు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కాళ్లకు చెప్పుల్లేకుండానే కొండ గుట్టల్లో సైతం వట్టి కాళ్లతోనే నడిచారు.ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలీలతో స్వయంగా మాట్లాడి వారి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. డబ్బులు క్రమం తప్పకుండా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అడిగిన వెంటనే అధికారులు పనులు కల్పిస్తున్నారని.. రూ.234 కూలీ ఇస్తున్నారని చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రతీరోజూ 2.66లక్షల మందికి ఉపాధి : గంధం చంద్రుడు
అనంతరం కలెక్టర్ చంద్రుడు మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ కోసం వడ్డుపల్లి గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ఉపాధి హామీ పథకం ఉపయోగపడుతుందన్నారు. అర్హులందరికీ పని కల్పించాలని...అడిగినవారికి లేదనకుండా పని ఇవ్వాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కోవిడ్ 19 జాగ్రత్తలు పాటిస్తూ పనులు నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు. ఈ పథకం కింద ప్రతీరోజూ 2.66లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 2.66 కోట్ల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించామన్నారు.కొత్తగా దరఖాస్తు చేసుకున్న 30వేల మందికి త్వరలోనే జాబ్ కార్డులు ఇస్తామన్నారు.

ఇటీవలే పీఎం కిసాన్ అవార్డు...
అనంతపురం జిల్లాలో ఇప్పటివరకూ 6 లక్షల కుటుంబాలు జాబ్ కార్డులు కలిగి ఉన్నాయని తెలిపారు. గతేడాది జిల్లాలో 6.50 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించినట్లు చెప్పారు. మంచి పనితీరు కనబరుస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ రామాంజనేయులును అభినందించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి అందించే స్ఫూర్తి అవార్డు రామాంజనేయులుకు అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. కాగా,కలెక్టర్‌గా గంధం చంద్రుడు పనితీరుకు ఇప్పటికే పలు అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. గత నెలలో అనంతపురం జిల్లాకు కేంద్రం పీఎం కిసాన్ అవార్డు కూడా దక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కలెక్టర్ చంద్రుడు భీమ్ దీక్షలో ఉన్నారు. మార్చి 15 కాన్షీరాం జయంతి నుంచి ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది.