ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బోణీ..?!: ఆ జిల్లా నుంచి ఏకగ్రీవం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బోణి కొట్టినట్టే కనిపిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి నామినేషన్ దాఖలు చేసిన మంగమ్మ విజయం సాధించినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి రంగయ్య నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించినట్లు చెబ
అనంతపురం: అనంతపురం జిల్లా నుంచి స్థానిక సంస్థల శాసన మండలి కోటా ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మంగమ్మ విజయం సాధించినట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగయ్య దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారని చెబుతున్నారు. సరైన పత్రాలను సమర్పించకపోవడం వల్ల రంగయ్య నామినేషన్ ను తిరస్కరించినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు జారీ చేసిన నోటిఫికేసన్ ప్రకారం.. ఇవ్వాళ నామినేషన్ల పరిశీలన షెడ్యూల్ అయింది. వైసీపీ తరఫున మంగమ్మ, టీడీపీ తరఫున రంగయ్య మాత్రమే నామినేషన్లను దాఖలు చేశారు. రంగయ్య సరైన పత్రాలను సమర్పించలేదని- పరిశీలన సందర్భంగా రిటర్నింగ్ అధికారులు నిర్ధారించారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.
రంగయ్య నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురి కావడం, పోటీలో మరో అభ్యర్థి లేకపోవడం వల్ల మంగమ్మ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం- నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 21వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు ఉద్దేశపూరకంగానే తిరస్కరించారని టీడీపీ నాయకులు, ఆ పార్టీ అభ్యర్థి రంగయ్య ఆరోపిస్తున్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామనీ స్పష్టం చేస్తోన్నారు. నిష్పక్షపాతంగా అధికారులు వ్యవహరించట్లేదని, అధికార పార్టీకి వంతపాడుతున్నారంటూ మండిపడుతున్నారు. నామినేషన్ వేయనివ్వకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు తనను అడ్డుకున్నారంటూ రంగయ్య ఆరోపిస్తోన్నారు.
అధికార పార్టీ శాసన సభ్యులు మాజీ మంత్రి శంకర నారాయణ, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య తదితరులు తమను బెదిరించారని టీడీపీ నాయకులు విమర్శిస్తోన్నారు. దీనికోసం వారు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని అంటోన్నారు. తాను మారువేషంలో వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి వచ్చిందని రంగయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications