అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూలి పనులకు వెళ్లిన మహిళలు మృత్యువాత పడ్డారు. పంట కోతలు చేస్తుండగా 33కేవీ విద్యుత్తు లైన్ తెగిపడటంతో ఆరుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు. రాయదుర్గం తాలుకా బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో ఓ రైతు పొలంలో మొక్కజొన్న కంకులు కోయడానికి కూలీలు వెళ్లారు. కోసిన వాటిని ట్రాక్టర్‌లో లోడ్ చేస్తున్న సమయంలో అక్కడి విద్యుత్ తీగ తెగి ట్రాక్టర్‌పై పడింది.
33కేవీ లైను కావడంతో తీవ్రమైన విద్యుదాఘాతంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం బళ్లారి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన కూలీలు ఈ విషయాన్ని గ్రామంలో ఉన్నవారికి తెలియజేయగా.. వారు విద్యుత్తుశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యంవల్లే ఇలా జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశాలు జారీచేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూలీలు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందుతున్న ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. నాణ్యత లేని తీగలు వాడటం, ఇన్సులేటర్లు కూడా నాసిరకమేనని, కాంట్రాక్టర్ దగ్గర నుంచి నాణ్యతలేని వస్తువులు తెప్పించి పనిచేయించడంవల్లే ఇలా జరుగుతున్నాయని రైతులు తరుచుగా ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications