ఏడుగురు టీచర్లు, నలుగురు విద్యార్ధులు.. కానీ అందరూ ఫెయిల్ !!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి ఫలితాలు విస్మయం కలిగిస్తున్నాయి. నలుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ.. ఇటీవల విడుదలైన పరీక్షల్లో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. దీంతో పాఠశాలలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గతేడాది జూన్‌లో యూపీ స్థాయి నుంచి విద్యాశాఖ ఈ పాఠశాలను ఉన్నతీకరించింది. గతంలో నలుగురు ఉపాధ్యాయులు ఉండగా, ఈ విద్యా సంవత్సరానికి మరో ముగ్గురిని కేటాయించడంతో మొత్తం ఏడుగురయ్యారు. పదో తరగతి చదువుతున్న ఈ నలుగురు విద్యార్థులలో ఒకరు తెలుగు, మరొకరు సైన్స్, మిగిలిన ఇద్దరు సాంఘిక శాస్త్రంలో అనుత్తీర్ణులయ్యారు.

ఈ పరిస్థితిపై స్పందించిన మండల విద్యాధికారి (ఎంఈఓ).. పది పరీక్షలు రాసిన విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధిస్తారని ఆశించామన్నారు. కానీ ఫలితాలు అనుకున్న విధంగా రాలేదని తెలిపారు. ఉపాధ్యాయులు తమ ప్రయత్నం చేశారని, విద్యార్థుల నిర్లక్ష్యమే ఈ వైఫల్యానికి కారణమన్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల సంఖ్య కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. మ్యాపింగ్ నిర్ణయాల వల్ల విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా స్కూల్ అసిస్టెంట్లు నియమితులు కావడం, ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్ళిపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ పరిస్థితిపై తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా వనరుల పంపిణీపై మరింత దృష్టి సారించడం అవశ్యకం.
ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, ఈసారి టెన్త్ ఫలితాల్లో 85.25% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు మరోసారి తమ ప్రతిభను చాటుతూ 87.90%తో బాలుర కంటే ముందంజలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం కూడా 78.39%కి పెరగడం గమనార్హం. జిల్లాల వారీగా చూస్తే, పార్వతీపురం మన్యం జిల్లా 96.07%తో అగ్రస్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా 57.02%తో అత్యల్ప ఉత్తీర్ణత నమోదు చేసింది. మొత్తం 2161 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించడం ఒక మంచి పరిణామం. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 25 నుండి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications