ఏపీలో కొత్త కేసుల్లో పెరుగుదల నమోదు, రికవరీ కూడా: చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోనే కేసులెక్కువ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. అయితే, ఒక్కోరోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. తాజాగా, 1200కిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,323 నమూనాలను పరీక్షించగా.. 1246 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1246 కరోనా కేసులు, 10 మంది మృతి
తాజాగా నమోదైన 1246 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,44,490కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు.
చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించగా, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,118కి పెరిగింది.

ఏపీలో 13,535 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1450 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,16,837కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 13,535 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,79,80,792 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 207 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 13 కేసుల చొప్పున కొత్తగా నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 13, చిత్తూరులో 207, తూర్పుగోదావరిలో 167, గుంటూరులో 117, కడపలో 93, కృష్ణాలో 138, కర్నూలులో 13, నెల్లూరులో 158, ప్రకాశంలో 128, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 62, విజయనగరంలో 13, పశ్చిమగోదావరిలో 123 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,90,258, చిత్తూరులో 2,42,954 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,726) కరోనా కేసులున్నాయి.

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో గత రెండు రోజులుగా కరోనా వైరస్ కేసులు 30వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా, 31వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా 300కు పైనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 15,65,696 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,382 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కు పెరిగింది. గురువారం 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,46,368లకు పెరిగింది. గురువారం 32,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,28,48,273కు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.78 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,00,162 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.89 శాతంగా ఉంది. గురువారం 72,20 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 84.15 కోట్లకు చేరింది.












Click it and Unblock the Notifications