భూమా అఖిలప్రియ, భర్త భార్గవ్ రామ్ కు 14 రోజుల రిమాండ్-కర్నూలు సబ్ జైలుకు..
ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లిలో నిన్న టీడీపీ నేతలు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. అఖిలప్రియ వర్గంపై తనపై దాడి చేసి హత్యాప్రయత్నం చేసిందని ఆరోపిస్తూ ఏవీ సుబ్బారెడ్డి కేసు పెట్టారు. అఖిల ప్రియ కూడా తన చున్నీ లాగి, బట్టలు చించేశారని కేసు పెట్టారు. ఈ రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యాయత్నం కేసులో అఖిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.
అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ నంద్యాల కోర్టులోహాజరుపర్చారు. దీంతో కోర్టు వీరిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అఖిలతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను కర్నూలు సబ్ జైలుకు తరలిస్తున్నారు. కోర్టు రిమాండ్ విధించిన తర్వాత వీరిద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి అఖిలప్రియకూ, ఏవీ సుబ్బారెడ్డికీ మధ్య ఎప్పటి నుంచో పోరు నడుస్తోంది. అఖిల తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆమెకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు రాకుండా సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని ఆమె అనుమానిస్తున్నారు. వాటి వివరాలు కూడా తనకు చెప్పకుండా దాచి పెట్టారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పెరిగిన గ్యాప్ కాస్తా దాడుల వరకూ వెళ్లింది. దీంతో తాజా ఘటనలు చోటు చేసుకున్నాయి.
మరోవైపు అఖిల, సుబ్బారెడ్డి వర్గాల మధ్య జరిగిన దాడుల్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం విచారణ కోసం త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ విచారణ జరిపి ఇచ్చే నివేదిక ఆధారంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీంతో ఈ నివేదిక ఆధారంగా టీడీపీ ఎవరిపై చర్యలు తీసుకోబోతందన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications