నారా లోకేష్‌ది 14వ నంబర్..!!
కాకినాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ పరిస్థితుల మధ్య చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో ఉద్యమాలను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసింది. కొత్త మిత్రపక్షం జనసేన పార్టీతో కలిసి నియోజకవర్గాల స్థాయిలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతోంది. ఉమ్మడిగా జనంలోకి ళ్లడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది.
ఈ క్రమంలో- తాజాగా ఓ యాక్షన్ కమిటీని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. 14 మందితో కూడిన కమిటీ ఇది. ఎంపిక చేసిన కొందరు సీనియర్ నేతలను ఈ జాబితాలో చేర్చింది. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో పాటు, బాబు ష్యూరిటీ- భవిషత్య్ గ్యారంటీ మేనిఫెస్టోపై ప్రచార కార్యక్రమాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
ఇందులో- యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాలయ అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్, నారా లోకేష్ ఉన్నారు.












Click it and Unblock the Notifications