ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: నైట్ కర్ఫ్యూ పొడిగింపు, గంట సడలింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 4 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే, కర్ప్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్లు పేర్కొంది.

ఏపీలో గంటపాటు రాత్రిపూట కర్ఫ్యూ సడలింపు
ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో వెల్లడించారు. సడలింపు సమాన్ని రాత్రి 10 గంటలకు బదులుగా 11 గంటల వరకు పెంచినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కర్ఫ్యూ అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, ఆరు మరణాలు
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 69,173 నమూనాలను పరీక్షించగా.. 1435 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 1435 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,00,038కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,702 మృతి చెందారు.

ఏపీలో 15, 472 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1695 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,70,864కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 15,472 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,72,539 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 199 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 31, చిత్తూరులో 199, తూర్పుగోదావరిలో 178, గుంటూరులో 133, కడపలో 53, కృష్ణాలో 175, కర్నూలులో 19, నెల్లూరులో 190, ప్రకాశంలో 109, శ్రీకాకుళంలో 50, విశాఖపట్నంలో 97, విజయనగరంలో 47, పశ్చిమగోదావరిలో 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,83,632, చిత్తూరులో 2,35,983 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,992) కరోనా కేసులున్నాయి.












Click it and Unblock the Notifications