2024 year ender: ఏపీ ప్రజల నుండి అలా 1229కోట్ల రూపాయల దోపిడీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో సైబర్ నేరాలు విపరీతంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా సైబర్ నేరాలు పెరిగాయి. ఇది ఏపీ వాసులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం. కేవలం 2024 సంవత్సరంలో ఫోన్ కాల్స్ ద్వారా పోలీసులకు ఏడు లక్షల ఇరవై మూడు వేల 378 ఫిర్యాదులు అందాయి అంటే ఎంత పెద్ద ఎత్తున సైబర్ నేరాలు జరిగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఏపీలో భారీగా సైబర్ నేరాలు
ఇక ఈ సైబర్ నేరాలకు సంబంధించిన కాల్స్ ను పరిశీలించి పోలీసులు కేసులు నమోదు చేసి వాటిని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 916 సైబర్ నేరాలను నమోదు చేసిన పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2024 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నేరాలలో సైబర్ నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది.

రోజుకు 3.36 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు
మొత్తం సైబర్ నేరాలలో బాధితులు 1229 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు అంటే ఏ మేరకు ఏపీ ప్రజలు మోసపోయారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు సగటున రోజుకు 3.36 కోట్ల రూపాయలను కొల్లగొట్టారని తాజాగా 2024 వార్షిక నేర గణాంకాల నివేదికలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.
2024లో ఏపీ ప్రజలను నిండా ముంచేశారు
2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో సైబర్ నేరాలపై ఫిర్యాదులు 52.4% పెరిగాయి. ఇక నమోదైన కేసుల సంఖ్య 34.3% పెరిగింది. బాధితులు కోల్పోయిన సొమ్ము విలువ ఏకంగా 610 శాతం పెరిగింది. సైబర్ నేరాల పైన ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఏపీలోని ప్రజలను సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతూనే ఉన్నారు.
225 కోట్ల రూపాయలను నేరగాళ్ల బారి నుండి కాపాడిన పోలీసులు
2023 వ సంవత్సరంలో 682 సైబర్ నేరాలు నమోదు కాగా 2024 సంవత్సరంలో 916 సైబర్ నేరాలు నమోదు కావడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక సైబర్ నేరాలపై ఫోన్ కాల్స్ ద్వారా 2023 లో నాలుగు లక్షల 74 వేల పైచిలుకు ఫిర్యాదులు రాగా, 2024 సంవత్సరంలో 1930 నెంబర్ కు 7 లక్షల ఇరవై మూడు వేల పైచిలుకు ఫిర్యాదులు వచ్చాయి. 2024లో పోలీసులు 225 కోట్ల రూపాయలను నేరగాళ్ల బారి నుండి కాపాడారు.












Click it and Unblock the Notifications