2029లో జనసేన పోటీ చేసే సీట్లు ఇవే..! తేల్చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి..!
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పటివరకూ సమన్వయంగా ముందుకు సాగుతున్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అప్పటి సీట్ల పంపకాలు వర్తించబోవని పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర జనసేన నేతలు కూడా తేల్చిచెప్పేస్తున్నారు. అదే జరిగితే 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో సీట్ల పంపకాలు ఎలా ఉండబోతున్నాయి, అందులో జనసేనకు దక్కే వాటా ఎంత అన్న దానిపైనా చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే (Janasena Mla) బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetty Srinivas) ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులకు గౌరవం ఉందంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అని ఎమ్మెల్యే బొలిశెట్టి తేల్చేశారు. కాపులు లేని రాజకీయం లేదని, పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు రెండు రాష్ట్రాల్లోనూ లేవని ఆయన స్పష్టం చేశారు. కోనసీమలో కాపులు అధికంగా ఉన్నందున కులాల మధ్య చిచ్చుపెట్టి కాపులను ఇతర కులాల నుంచి విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విపక్షాలపై ఆయన సంచలన విమర్శలు చేశారు.

అలాగే వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎన్ని స్ధానాలకు పోటీ చేస్తుందో కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పేశారు.
2029 ఎన్నికల్లో జనసేన 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉన్న అన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుందని కూడా తెలిపారు. తద్వారా గతంలో తీసుకున్న సీట్లకు మించి ఇకపై పోటీ చేసేందుకు జనసేన అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఎమ్మెల్యే బొలిశెట్టి చెప్పకనే చెప్పారు. ఈ మాటలు ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కొనసాగింపుగా కనిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
