ఏపీ ప్రభుత్వంతో 21 ఏళ్ల యువతి కీలక ప్రాజెక్ట్.. ఎవరామె ? ఏంటా స్టోరీ ??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు కార్యక్రమాలు సైతం నిర్వహిస్తుంది. అంతే కాకుండా మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీని కూడా విస్తృత స్థాయిలో వినియోగించేందుకు మొగ్గు చూపుతోంది.
అందులో భాగంగానే డ్రోన్‌ల తయారీ, పరిశోధన, సేవల రంగంలో ఏపీని జాతీయ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న 'డ్రోన్ సిటీ'పై రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దృష్టి సారించింది. డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, ఇన్నోవేషన్, పెట్టుబడుల ప్రోత్సాహమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా స్పష్టం చేస్తోంది.

ప్రతిభతో ఆకట్టుకుంటున్న 21 ఏళ్ల యువతి..
ఈ నేపథ్యంలోనే యువతను సైతం ఏపీ సర్కారు ప్రోత్సాహిస్తుంది. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ రంగంలో తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకున్న విజయవాడకు చెందిన 21 ఏళ్ల ధవళ సాయి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల సదస్సు సందర్భంగా, ముఖ్యమంత్రి సమక్షంలో ధవళ సాయి బృందం - రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ కుదిరింది. కర్నూలు డ్రోన్ సిటీలో తమ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంపై ధవళ సాయి ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయం, వైద్య అత్యవసర సేవలు, సరుకు డెలివరీ వంటి రంగాల్లో డ్రోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణ ఎంతో కీలకమని ఆమె వెల్లడించారు.
ఎవరామే..
విజయవాడకు చెందిన 21 ఏళ్ల ధవళ సాయి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఇంటర్న్‌షిప్ చేస్తుంది. ఆమెకు డ్రోన్‌లపై ఉన్న మక్కువతో ప్రముఖ సైంటిస్ట్ ఘోష్, కో-ఫౌండర్ ఓంకార్ చోప్రా ప్రోత్సాహంతో 'అల్గోబొటిక్స్' పేరిట డ్రోన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసింది. దీని సాయంతో ప్రస్తుతం ఒక్కో డ్రోన్‌కు ఒక్కో పైలట్ అవసరమయ్యే పరిస్థితి ఉండగా.. ఒకే డివైస్‌తో వందకు పైగా డ్రోన్లను ఒకేసారి నియంత్రించేందుకు దోహదం చేస్తుంది. టెక్నాలజీ రంగంలో యువతి కీలక రాష్ట్ర ప్రాజెక్టుకు నాయకత్వం వహించడం రాష్ట్రానికి గర్వకారణంగా మారిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు దేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ కూడా ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి చూపింది. కర్నూలులోని డ్రోన్ సిటీ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. డ్రోన్ తయారీ, R&D, శిక్షణ కేంద్రాలు, స్టార్టప్ ప్రోత్సాహం వంటి కార్యక్రమాల్లో ఇవి వినియోగించనున్నారు. డ్రోన్ టెక్నాలజీలో దేశాన్ని ముందంజలో ఉంచే లక్ష్యంతో ఈ సిటీ ఒక వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని గరుడ ఏరోస్పేస్ స్పష్టం చేసింది. అందులో భాగంగానే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో గరుడ ఏరోస్పేస్ ప్రతినిధులు సమావేశమై తమ విస్తరణ ప్రణాళికలను వివరించారు.












Click it and Unblock the Notifications