ఏపీలో యోగా లీగ్- రికార్డు సృష్టించాలన్నా.. బ్రేక్ చేయాలన్నా మోదీకి మాత్రమే సాధ్యం: చంద్రబాబు
International Yoga Day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగరనగరం విశాఖపట్నం కోలాహలంగా మారింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఇంకాస్సేపట్లో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. వారితోపాటు పలువురు మంత్రులు యోగా కార్యక్రమంలో పాల్గొనున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్.. నగరవ్యాప్తంగా యోగా క్యాంపులను నిర్వహిస్తోంది.

మొత్తం అయిదు లక్షల మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్ కే బీచ్ దీనికి వేదిక. ఇదే రోజున దాదాపుగా 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ అందజేయనుంది. వరల్డ్ రికార్డులతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా ఈ వేడుకకు చోటు దక్కనుంది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. శుక్రవారం నాడు 22,122 మంది గిరిజన విద్యార్థులు యోగాసనాలను వేశారని, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారని ప్రకటించారు. యోగాను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని, ప్రపంచం మొత్తానికి దీన్ని పరిచయం చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు.
మోదీని విజనరీ ప్రైమ్ మినిస్టర్.. అని సంబోధించారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో అంతర్జాతీయ యోగా కార్యక్రమం నడుస్తోందని అన్నారు. 13 లక్షలకు పైగా ప్రదేశాల్లో 10 కోట్లమందికి పైగా ప్రజలు యోగాసనాలు వేస్తోన్నారంటే దానికి కారణం ప్రధాని మోదీయేనని పేర్కొన్నారు.
యోగాంధ్ర కార్యక్రమం ద్వారా 1.44 కోట్లమందికి యోగాలో శిక్షణ ఇచ్చామని చంద్రబాబు అన్నారు. 1.07 కోట్ల సర్టిఫికెట్లను అందజేశామని వివరించారు. ఆర్ కే బీచ్ నుంచి భోగాపురం వరకు అయిదు లక్షల మంది యోగాలో పాల్గొంటోన్నారని చెప్పారు.
రికార్డు సృష్టించాలన్నా.. దాన్ని బ్రేక్ చేయాలన్నా ప్రధాని మోదీకి మాత్రమే సాధ్యపడుతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.17 కోట్ల మంది ఒకేసారి యోగా చేస్తున్నారని, విశాఖలో ఒకే చోట 3 లక్షల మంది యోగా చేసి రికార్డు నెలకొల్పబోతోన్నామని పేర్కొన్నారు.
ఏపీలో సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభం అవుతుందని చంద్రబాబు ప్రకటించారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లో యోగాను భాగం చేసేలా కృషి చేయాలని ప్రధాని మోదీని కోరుతున్నానని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications