తిరుపతి చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం: పూజను అరెస్ట్ చేసిన పోలీసులు
తిరుపతి: నగరంలో సంచలనం సృష్టించిన చిన్నారి ఉత్తమ్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శనివారం నాడు తిరుపతి విద్యానగర్ కాలనీలో కిడ్నాప్‌కు గురైన 27రోజుల బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన పూజ అనే యువతి, ఆమె భర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి ఎస్పీ చెప్పిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరం సమీపంలోని మేలవూరులో కిడ్నాపర్లు ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి ఓ బృందాన్ని పంపి పూజ దంపతులను పట్టుకున్నారు.

మొత్తం 24 టీములను ఏర్పాటు చేయడంతో వీరి ఆచూకీ లభ్యమైందన్నారు. కిడ్నాప్ జరిగిన ప్రాంతానికి వెళ్లి కొత్తగా ఎవరు వచ్చారన్న కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పూజ అనే యువతి వచ్చినట్టు తెలుసుకుని, మహిళను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
చిన్నారికి ఎటువంటి అపాయంలేదని వారు తెలిపారు. నిందితులను విచారిస్తున్నామని, ఈ సాయంత్రం మీడియా ముందుకు ప్రవేశపెడతామని తెలిపారు.












Click it and Unblock the Notifications