బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు.. ఏపీకి తీవ్ర హెచ్చరిక!
గత నెలలో సగటు వర్షపాతం కూడా నమోదవక మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఏపీ ప్రజలు. అయితే జులై నెలలో రాష్ట్రంలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు వాతావరణం కాస్తంత చల్లగానే ఉందని చెప్పొచ్చు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణకోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉండటంతో రాగల 24 గంటల్లో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
అరేబియాలో చురుగ్గా రుతుపవనాలు
ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, తిరుపతి, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని, ఈ నెలలో దాదాపుగా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడురోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ చెబుతోంది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

10 వరకు విస్తారంగా వర్షాలు
ఈనెల 10వ తేదీ వరకు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనానికి తోడు బంగాళాఖాతంలో ఈనెల 15న మరో అల్పపీడనం, ఈనెల 23వ తేదీన ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. 23వ తేదీన ఏర్పడే అల్ప పీడనం బలహీనపడి వాయుగుండంగా మారుతుందని, దీనివల్ల భారీ వర్షపాతం రాష్ట్రంలో నమోదవుతుందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో కూడా జోరుగా వానలు పడుతున్నాయి. రానున్న నాలుగు రోజులు తేలికపాటి జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications