కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు: పెళ్లి కుమార్తె మృతి
విజయవాడ: కృష్ణాజిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెం వద్ద కేఈబీ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెళ్లికుమార్తె బాలకుమారి ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా, ఓ బాలుడు గల్లంతయినట్లు పోలీసులు వెల్లడించారు. గల్లంతైన వారిని వెతికేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. గురువారం ఉదయం 4 గంటలకు గుంటూరులోని కళ్యాణమండపంలో అల్లంశెట్టి బాలకుమారి (29) వివాహం జరగనుంది. కారులో పెళ్లికూతురు బాలకుమారి, స్నేహితురాలు నాగచంద్ర అక్కడికక్కడే మృతి చెందారు.

మృతదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బుధవారం మధ్యాహ్నం పెళ్లి కుమార్తెతో పాటు ఆరుగురు పెళ్లి బృందం కారులో కృష్ణాజిల్లా చల్లపల్లి నుంచి గుంటూరు రేపల్లె వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బంధువులు, కుటుంబ సభ్యులు రెండు మూడు కారుల్లో ముందుగానే వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications