మడిచి... బ్యాగులో పెట్టుకుపోతున్నారు!!
గత రెండు నెలల్లో భారతీయ రైల్వే కోచ్‌ల నుంచి లక్షల రూపాయల విలువైన దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీ జరిగిన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఇవి జరుగుతున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్‌లో ప్రయాణించేవారికి దుప్పట్లు, దిండ్లు వంటివాటిని రైల్వే శాఖ ఉచితంగానే అందజేస్తుంది. ప్రయాణం పూర్తయిన తర్వాత కొందరు ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో పెట్టుకుపోతున్నారు.
ప్రయాణికులే కాకుండా ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటివాటికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ తరహా సంఘటనలు భోపాల్‌లో ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఇలాంటి చోరీలు జరిగాయని రైల్వే అధికారులు వెల్లడించారు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి.

అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు ఉంటారు. వారిలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్‌షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు అపహరణకు గురయ్యాయి. ఈ తరహా చర్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోలేదు. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications