ఏపీలో గృహ విద్యుత్ ఛార్జీల మోత.. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి..
ఆంధ్రప్రదేశ్‌లో గృహ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు షాక్ ఇవ్వబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న శ్లాబులలో మార్పులు చేశాయి. ఈ మేరకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ప్రతిపాదనలు అందించాయి.. విద్యుత్ ఛార్జీలను స్వల్పంగా పెంచేందుకు అవకాశం కల్పించాలని కోరాయి. డిస్కంల ప్రతిపాదనల ప్రకారం ఏపీ ప్రజలపై రూ 3685 కోట్ల భారం పడే అవకాశం ఉంది.. ఈ కొత్త ఛార్జీలు, మార్పులు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం..

ప్రస్తుత మూడు కేటగిరిలు.. ఇకపై రెండే.
విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుతం ఎ,బి, సి అను మూడు కేటగిరిలుగా ఉన్న వినియోగదారులను రెండుగా చేసింది. ఈ కేటగిరిల్లోనూ శ్లాబుల వారిగా మార్పులు చేసి డిస్కంలు ప్రతిపాదించాయి. సామాన్యులకు అదనపు భారం పడేలా వడ్డన సిద్ధం చేశాయి. ప్రస్తుతం ఎ కేటగిరిలో 50 యూనిట్ల లోపు వినియోగదారులకు రూ 1.45లు చొప్పున డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు 50 యూనిట్ల విభాగానికి చెందిన గృహవినియోగదారుడిని 30 యూనిట్లకే కుదించింది . మిగిలిన 20 యూనిట్ల విభాగానికి రూ. 2.80ల చొప్పున వసూలు చేయనున్నాయి. ప్రస్తుతం ఉన్న కరెంట్ రేట్ల ప్రకారం 50 యూనిట్లకు వినియోగదారుడు రూ.72.50లు చెల్లిస్తే, డిస్కంల కొత్త ప్రతిపాదనల ప్రకారం రూ.99.50లు చెల్పించాల్సి ఉంటుంది.

విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలు ఇలా..
డిస్కంల ప్రతిపాదనల ప్రకారం ఇకపై గృహాలకు 0-30 యూనిట్ల విద్యుత్ వినియోగానికి యూనిట్‌కు రూ.1.45 పైసలు వసూలు చేసేందుకు అనుమతి కొరాయి. 31-75 యూనిట్లకు రూ.2.80 పైసలు, 0-100 యూనిట్లకు రూ.4లు, 101-200 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.5 లు, 201-300 యూనిట్ల విద్యుత్‌కు రూ.7, 300 యూనిట్ల పైన వాటికి రూ.7.50 పైసలు చొప్పున వసూలుకు అనుమతి కోరారు. ప్రస్తుతం ఉన్న 301-400 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తే రూ.7.95 పైసలు, 401 నుంచి 500 యూనిట్ల కరెంట్ వాడకానికి రూ.8.50 పైసలు, ఆ పైన విద్యుత్ యూనిట్ల వినియోగానికి రూ.9.95 పైసలు చొప్పున చార్జీలు విధించనున్నాయి.

వాణిజ్య పరిశ్రమలకు ఊరట..
మరోవైపు పరిశ్రమల వినియోగం పెంచాలన్న పేరుతో వాటికి విద్యుత్ టారీఫ్ ఛార్జీలను తగ్గించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. హైటెన్షన్ విద్యుత్ సర్వీసులకు 11 కెవీ, 33 కేవీ, ఈహెచ్‌టీల టారిఫ్‌లలో మార్పు లేదని పేర్కొన్నాయి. అటు ప్రస్తుతం 0-50 యూనిట్లు వాడే పరిశ్రమలకు యూనిట్ రూ.6.90 పైసల నుంచి రూ.5.40 పైసలకు తగ్గించారు. పరిశ్రమలకు విధించే టారీఫ్‌లపై మార్పు లేదని తెలిపాయి.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగింపు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని డిస్కంలు తెలిపాయి. మోటర్ల హార్స్ పవర్ పెరిగే కొద్దీ విధించే ఛార్జీలను పెంచాలని అడగలేదు.. గృహ వినియోగాదారులపై భారం లేకుండా నామమాత్రంగా చార్జీలను పెంచేందుకు అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు 2014 నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి డిస్కంలు రూ 28,599 కోట్ల నష్టాల్లో ఉన్నాయని పేర్కొంది. అంతే కాకుండా రూ.37,465 కోట్ల అప్పులున్నట్లు తెలిపాయి.












Click it and Unblock the Notifications