ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: జిల్లాల వారీగా కొత్త కేసులివే, పరీక్షల ధరల తగ్గింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇంతకుముందు రోజు కేవలం 300 కరోనా కేసులే నమోదు కాగా, తాజాగా, 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కోలుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

ఏపీలో కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు, ఐదుగురు మృతి
గత 24 గంటల వ్యవధిలో 61,452 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 500 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 8,76,336కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో ఐదుగురు కరోనా బాధితులు మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 7064కు చేరింది.

కర్నూలులో అత్యల్పంగా కేసులు
ఏపీ జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 19, చిత్తూరులో 88, తూర్పుగోదావరిలో 47, గుంటూరులో 55, కడపలో 34, కర్నూలులో 9, నెల్లూరులో 22, ప్రకాశంలో 26, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 19, పశ్చిమగోదావరిలో 63 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో గణనీయంగా తగ్గుతున్న యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో 563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 8,61,717కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4660 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,37,377 నమూనాలను పరీక్షించారు.

ఏపీలో తగ్గిన కరోనా పరీక్షల ధరలు
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల ధరలు తగ్గాయి. ఈ మేరకు ధరలు తగ్గిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పంపే నమూనాల టెస్టు ధరలను రూ. 800 నుంచి రూ. 475కు తగ్గించింది. ఎణ్ఏబీఎల్ ల్యాబుల్లో కరోనా టెస్టు ధరను రూ. 1000 నుంచి రూ. 499కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తయారీ ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో కరోనా టెస్ట్ కిట్ల ధర తగ్గిందని, అందువల్లే కరోనా పరీక్షల ధరలు తగ్గించినట్లు ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications