ఏపీ పాజిటివ్.. కరోనా నెగిటివ్: రాష్ట్రంలో తగ్గుతున్న కొత్త కేసులు, మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వారం క్రితం వరకు పదివేలకు తగ్గకుండా నమోదైన కేసులు ఇప్పుడు 7-8వేల మధ్యే నమోదవుతున్నాయి. కరోనా పరీక్షల సంఖ్య తగ్గనప్పటికీ పాజిటివ్ కేసులు తగ్గడం మంచి విషయంగా చెప్పవచ్చు. అంతేగాక, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

ఏపీలో 7228 కరోనా కేసులు.. 45 మంది మరణాలు
గత 24 గంటల్లో 72,838 నమూనాలను పరీక్షించగా.. 7228 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,46,530కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వివరాలను వెల్లడించింది. ఒక్క రోజు వ్యవధిలో 45 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5506కి చేరింది.

జిల్లాల వారీగా కరోనా మరణాలు
జిల్లాల వారీగా కరోనా మరణాలను గమనించినట్లయితే.. చిత్తూరు జిల్లాలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఇద్దరేసి చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు.

జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఇక జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 612,
చిత్తూరులో 536, తూర్పుగోదావరిలో 1112, గుంటూరులో 648, కడపలో 600,
కృష్ణాలో 428, కర్నూలులో 229, నెల్లూరులో 479, ప్రకాశంలో 502, శ్రీకాకుళంలో 319,
విశాఖపట్నంలో 414, విజయనగరంలో 387, పశ్చిమగోదావరిలో 962 కేసులు నమోదయ్యాయి.

కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ..
కాగా, గత 24 గంటల్లో కరోనా నుంచి 8291 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 5,70,667కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 70,357 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53,02,367 నమూనాలను పరీక్షించారు. అత్యధిక కేసులు నమోదైనా రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత ఏపీనే ఉంది. ఇక యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత మూడో స్థానంలో ఏపీ ఉంది.












Click it and Unblock the Notifications