ఏపీలో అరకోటి దాటిన కరోనా పరీక్షలు: కేసులు పెరుగుతున్నా..తగ్గుతున్న యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. కేసులు మాత్రం మళ్లీ ఎక్కువగానే నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. అయితే, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఏపీకి ఊరటనిచ్చే అంశం.

ఏపీలో కొత్తగా 7293 కరోనా కేసులు.. 57 మరణాలు
గత 24 గంటల్లో 75,990 నమూనాలను పరీక్షించగా.. 7293 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,68,751కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలో గత 24 గంటల్లో 57 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5663కు చేరింది.

జిల్లాల వారీగా కరోనా మరణాలు
కొత్తగా నమోదైన మరణాల్లో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా పది మంది మృతి చెందారు. చిత్తూరు, కడప జిల్లాల్లో 8 మంది చొప్పున, కృష్ణాలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

ఏపీ జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు
జిల్లాల వారీగా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 213,
చిత్తూరులో 975, తూర్పుగోదావరిలో 1011, గుంటూరులో 393, కడపలో 537,
కృష్ణాలో 450, కర్నూలులో 206, నెల్లూరులో 466, ప్రకాశంలో 620, శ్రీకాకుళంలో 306,
విశాఖపట్నంలో 450, విజయనగరంలో 444, పశ్చిమగోదావరిలో 922 కొత్త కేసులు నమోదయ్యాయి.

అరకోటి దాటిన టెస్టులు.. తగ్గుతున్న యాక్టివ్ కేసులు
ఏపీలో ఇప్పటి వరకు 55,23,786 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,97,294 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 65,794 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా, 9125 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఆ కేసుల కంటే కూడా కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. గతంలో లక్ష దాటుందనుకున్న యాక్టివ్ కేసుల సంఖ్య నేడు 65వేలకుపైగానే ఉండగటం గమనార్హం.












Click it and Unblock the Notifications