అమ్మ చనిపోదాం అంటుంది.. ఎనిమిదేళ్ల బాలుడు ఏం చేశాడంటే ?
అమ్మ చనిపోదాం అంటుంది.. సహాయం చేయండి అంటూ ఓ ఎనిమిదేళ్ల బాలుడు కలెక్టర్ కి విన్నవించుకున్నాడు. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్న కూడా ఇది నిజం. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రతి సోమవారం లాగానే గుంటూరు కలెక్టరేట్‌లో ఈరోజు ( జూన్ 30, 2025 ) కూడా ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. తమ ఫిర్యాదులను ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న ఎందరో పెద్ద వ్యక్తులను సైతం దాటుకుంటూ ఓ స్కూల్ బ్యాగ్ వేసుకుని, చేతిలో ఫిర్యాదు పత్రంతో వచ్చిన ఎనిమిదేళ్ల బాలుడు యశ్వంత్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన తల్లి బాధ గురించి అధికారుల ముందు విన్నవించాడు. కానీ ఆ బాలుడి నోట అమ్మ చనిపోదామంటోంది అంటూ పలికిన ఆ మాటలు అందరితో కంటతడి పెట్టించాయి.

గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల రాధిక, స్థానిక ప్రభుత్వాసుపత్రి గేట్ వద్ద టిఫిన్ బండి నడుపుతూ తన కుటుంబాన్ని పోషించేది. కానీ ఇటీవల జరిగిన రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఆమె బండిని అధికారులు తొలగించారు. బండిని గుట్టలుగా లేపి కాలువలో పడేశారని, ఇక జీవనం ఎలా సాగించాలో తెలియక పేద కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో భర్త లేకుండా ఒంటరిగా బతుకుతోన్న రాధిక పరిస్థితి మరింత విషమంగా మారింది.
తల్లి వేదనను చూడలేకపోయిన యశ్వంత్... బండి పెట్టుకోవడానికి ఎవ్వరు అనుమతి ఇవ్వట్లేదంటోంది అంటూ కలెక్టర్ నాగలక్ష్మిని ఆశ్రయించాడు. చేతిలో ఫిర్యాదు పత్రంతో నిశ్చలంగా నిలబడి తన వేదనను ఆవేదనగా మార్చి అధికారుల గుండెల్ని తడిపాడు. యశ్వంత్ విన్నపాన్ని శ్రద్ధగా విన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. ఆ కుటుంబానికి తక్షణమే జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోండని ఆదేశాలు జారీ చేశారు.
యశ్వంత్ తల్లి తిరిగి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఎనిమిదేళ్ల వయసులో స్కూల్ పనులు, ఆటలు మరిచి, తల్లి బాధ పడుతుందని.. ఆమె కన్నీరు తుడిచేందుకు యశ్వంత్ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications