నూజివీడు ట్రిపుల్ ఐటీలో 800 మంది విద్యార్ధుల అస్వస్ధత-విచారణకు కమిటీ..!
ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రధానమైన నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. గత మూడు రోజులుగా ఇలా వరుసగా విద్యార్ధులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. దీంతో మూడు రోజుల్లోనే మొత్తం 800 మందికి పైగా విద్యార్ధులు ఆస్పత్రి పాలయ్యారు. దీంతో అసలు ఈ ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది.
ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో మూడు రోజులుగా వందల సంఖ్యలో విద్యార్దుులు అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీంతో వీరిలో పలువురిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఐటీ మెస్ లలో ఆహారం నాణ్యత సరిగా లేకపోవడం వల్లే విద్యార్ధులు ఇలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. దీనిపై విచారణకు అధికారులు ఓ కమిటీని నియమించారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తనను ఆందోళనకు గురిచేసిందని విద్యామంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను అదేశించినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉందని లోకేష్ తెలిపారు. మరి విచారణ కమిటీ నివేదిక వస్తే కానీ ఏం జరిగిందో తెలిసే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications