ఏపీలో కొత్తగా వందలోపే కరోనా కేసులు: ఆ జిల్లాలో సున్నా, వెయ్యికి చేరువలో యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,445 నమూనాలను పరీక్షించగా 95 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఏపీలో వెయ్యికి చేరువలో యాక్టివ్ కేసులో
ఒక్క రోజు వ్యవధిలో ఒక మరణం సంభవించింది. విశాఖపట్నంలో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 7157కు చేరింది. గత 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,79,780కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1162 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,32,14,548 కరోనా నమూనాలను పరీక్షించారు.

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 5, చిత్తూరులో 9, తూర్పుగోదావరిలో 7, గుంటూరులో 16, కడపలో 1, కృష్ణాలో 17, కర్నూలులో 4, నెల్లూరులో 7, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 16, విజయనగరంలో 3, పశ్చిమగోదావరిలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా,
ప్రకాశంలో జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

దేశంలో కరోనా నుంచి కోటిమందికిపైగా కోలుకున్నారు
ఇక, దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 11,039 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.07 కోట్లకు చేరింది.
ఒక్కరోజు వ్యవధిలో 14,225 మంది కరోనా నుంచి కోలుకోవడంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆ మహమ్మారిని జయించినవారి సంఖ్య 1,04,62,631కి చేరింది.

లక్షన్నరకు చేరువలో యాక్టివ్ కేసులు
కొత్తగా 110 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 1,54,596కు చేరింది. ప్రస్తుతం దేశంలో లక్షన్నర కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 2 నాటికి దేశంలో 41,38,918 మంది టీకా వేయించుకున్నారు. మంగళవారం ఒక్కరోజే లక్షా 88వేల మందికి వ్యాక్సిన్ వేశారు.












Click it and Unblock the Notifications