బాలికపై ఆటోడ్రైవర్ రేప్, అరెస్ట్: ప్రాణం తీసిన విద్యుత్ తీగ
హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మాయమాటలు చెప్పి మైనర్‌ను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కిడ్నాప్, అత్యాచార కేసులను నమోదు చేశారు. నిందితుడిని 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు.
రైతు ప్రాణం తీసిన విద్యుత్ తీగ
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అడవి పందుల బారినుంచి పంటను రక్షించుకోవాలనే ఉద్దేశంతో పొలం చుట్టూ వేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ రైతు మృతి చెందాడు. ఏటూరునాగారం మండలం రుయ్యూరులో ఈ ఘటన జరిగింది. పందుల కోసం పెట్టిన విద్యుత్ ప్రమాదవశాత్తు కాలికి తగలడంతో రాజయ్య అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

స్టేట్ బ్యాంకులో చోరీ
వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని ఎస్‌బిఐ బ్యాంకులో చోరీ జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఇద్దరు దొంగలు బ్యాంకులో చోరీకి పాల్పడినట్లు సిసి ఫుటేజీ సహాయంతో గుర్తించారు. ఈ చోరీలో దుండగులు లాకర్లు తెరిచే ప్రయత్నం చేయగా వీలులేకపోవడంతో.. బ్యాంకులోని 3సిపియులు, 2 మానిటర్లు, 2 ప్రింటర్లు దొంగలించారు.
సోమవారం ఉదయం బ్యాంకు తెరిచిన అధికారులు చోరీ విషయాన్ని గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో బ్యాంకు లాకర్లలో రూ. 93లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదు చేయడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిసిఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
షాబాద్ తహసీల్దార్ ఆఫీస్‌లో వీఆర్‌వోపై దాడి
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఓ వెంకటరామిరెడ్డిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. పహణీపత్రం జారీ విషయంలో వీఆర్‌వోకి, స్థానికుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే వీఆర్‌వోపై స్థానికుడు చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన మిగతా వీఆర్‌వోలు, రెవెన్యూ సిబ్బంది కార్యాలయం మూసివేసి ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications