మీరు చాలా ట్రెండీ సార్...చంద్రబాబుకు ఓ విద్యార్థిని కాంప్లిమెంట్...సిఎం చిరునవ్వులు...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

నెల్లూరు జిల్లా: అరుదుగా చిరునవ్వులు చిందించే సిఎం చంద్రబాబు మోముపై మందహాసం వెల్లివిరిసేలా చేసిందో విద్యార్థిని. సిఎం చంద్రబాబు స్టయిల్ పై ఓ డిగ్రీ విద్యార్థిని అసలే మాత్రం ఊహించని విధంగా కాంప్లిమెంట్ ఇవ్వడంతో ముందు అవాక్కయిన ముఖ్యమంత్రి ఆ తరువాత చిరునవ్వులు చిందించారు. నెల్లూరు జిల్లాలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.

నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సిఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. అందులో ప్రత్యేకించి ఓ డిగ్రీ విద్యార్ధిని సిఎం చంద్రబాబుతో సంభాషిస్తూ ''మీరు చాలా ట్రెండీగా ఉంటారు సార్‌'' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. దీంతో సాధారణంగా సీరియస్ గా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మాటకు ఒక్కసారిగా చిరునవ్వులు చిందించారు.

 విద్యార్థులతో...ముఖాముఖీ...

విద్యార్థులతో...ముఖాముఖీ...

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కాకుటూరులోని వీఎస్‌యూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న మనోజ్ఞ అనే విద్యార్థిని ముఖ్యమంత్రితో మాట్లాడారు. కళాశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ విధానం చాలా బాగుందని, దాని వల్ల తాము కళాశాలలకు విధిగా హాజరవుతున్నామన్నారు. అదే విధంగా వర్చువల్‌ తరగతి గదుల వల్ల తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. విద్యా విధానంలో కూడా సాంకేతికతను ప్రవేశపెట్టడం తమకు సంతోషంగా ఉందని చెప్పారు.

సార్...మీరు చాలా ట్రెండీ...

సార్...మీరు చాలా ట్రెండీ...

విద్యార్థిని మనోజ్ఞ మీరు ఇచ్చిన సైకిళ్ల వల్ల ఎంతోమంది అమ్మాయిలు తమ చదువును కొనసాగిస్తున్నారని, అన్ని తరగతుల బాలికలకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కోరారు. సంభాషణ ముగింపులో ఉన్నట్టుండి ఆ విద్యార్థిని ఒక్కసారిగా చంద్రబాబుతో మీరు చాలా ట్రెండీగా ఉంటారు సార్‌ అనడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. దీంతో అందరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చిరునవ్వులు చిందించారు.

 విద్యార్థుల ప్రశంసలు...

విద్యార్థుల ప్రశంసలు...

అనంతరం వీఎస్‌యూలోనే మెరైన్‌ కోర్సు చదువుతున్న శాంతి రోమి అనే విద్యార్థిని మాట్లాడుతూ మీరు ప్రవేశ పెట్టిన విద్యోన్నతి పథకం ఎంతో ప్రయోజనకరమైనదని ప్రశంసించారు. ఈ పథకం ద్వారా పేదవారు కూడా విదేశీ విద్య పొందడానికి అవకాశం కలిగిందన్నారు. సమర్థుడైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తమకు సంతోషంగా ఉందని ప్రశంసించారు.

 మీరే మాకు స్ఫూర్తి...

మీరే మాకు స్ఫూర్తి...

మీరు మాకు అన్ని విషయాల్లోనూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని సిఎం చంద్రబాబు నుద్దేశించి మహబూబ్‌ అనే పీజీ విద్యార్ధి అన్నారు. సమస్యలపై పట్టువీడని పోరాటం చేస్తూ అలెగ్జాండర్‌ను గుర్తు చేస్తున్నారని కొనియాడారు. నదుల అనుసంధానం చేయడం ద్వారా మీరు అపర భగీరథుడనిపించుకున్నారని ప్రశంసించారు. వీఎస్ యూనివర్శిటీలో బయోటెక్నాలజీ రీసెర్చ్‌ స్కాలర్‌ గాయత్రి మాట్లాడుతూ తిరుపతిని విద్యా కేంద్రంగా మార్చడంలో మీరు ఎనలేని కృషి చేశారన్నారు. విద్యార్ధుల మాటలకు స్పందించిన సిఎం చంద్రబాబు నేటి విద్యార్ధులు విజన్‌లో తమను మించిపోతున్నారని అభినందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A College girl manogna praised AP CM Chandrababu Naidu for his development programmes and dressing style at VS University inauguration function in Nellore district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి