విజయవాడలో హైఎండ్ కారులో వ్యక్తి మృతదేహం: హత్యా? ఆత్మహత్యా?, అతనో కంపెనీ యజమాని
అమరావతి: విజయవాడ నగరంలో కారులో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మ్యానర్ ఫుడ్ ప్లాజా ఎదురు రోడ్డులో పార్క్ చేసి ఉన్న కారు( AP 16FF 9999)లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతుడిని జడ్‌ఎక్స్ఎన్ సిలిండర్ల కంపెనీ యజమాని, తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌గా నిర్ధారణకు వచ్చారు. జి. కొండూరు మండలం చెరువు మాధవరంలో రాహుల్‌కి సంబందించిన కంపెనీ ఉంది. బుధవారం రాత్రి 7.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గురువారం ఉదయం పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు అతని సెల్ సిగ్నల్స్ ఆధారంగా లోకేషన్ పరిశీలించగా మ్యానర్ ఫుడ్ ప్లాజా ఎదురుగా చూపించింది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే కారులో మృతదేహం కనిపించింది. రాహుల్‌ది హత్య? ఆత్మహత్య? అనే కోనంలో పోలీసులు క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ పాలరాజు పరిశీలించారు. కారు డోరు తెరుచుకోకపోవడంతో మొదట టైరు తీసేసి లాక్ ఓపెన్ చేయాలని ప్రయత్నించారు. అలా కుదరకపోవడంతో మెకానిక్‌లను పిలిచి కారు అద్దం పగలగొట్టి కారు డోర్లను తెరిచారు. క్లూస్ టీం అక్కడ ఆధారాలను సేకరించింది. ఆ కారు ఎక్కడెక్కడ తిరిగిందనేదానిపైనా విచారిస్తున్నారు.
రాహుల్‌ది హత్యే
కాగా, రాహుల్ మెడకు తాడు గట్టిగా బిగించినట్లు ఉండటం, కారులోనే తాడు కూడా ఉండటంతో అతనిది హత్యగానే పోలీసులు నిర్ధారించారు. రాహుల్ ను ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఏదో ఒక విషయంలో కాసేపు వివాదం కొనసాగిన అనంతరం దుండగులు రాహుల్‌ను హత్య చేసివుంటారని అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు అతని కాల్ డేటాను సేకరించి మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.
ఘోరం: వేగంగా వచ్చి లారీ ఢీకొనడంతో దంపతులు మృతి
విశాఖపట్నంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకాని నగర్ హైవేపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు గాజువాక జగ్గు జంక్షన్‌కు చెందిన నాగేశ్వరరావు, రమాదేవిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా వేటపాలేనికి చెందిన నాగేశ్వరరావు, విశాఖలోని ఓ ప్రైవేట్ కాలేజీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతను తన కుటుంబ సభ్యులతో కలిసి గాజువాకలో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు.
అయితే, గురువారం నాడు మర్రిపాలెంలో ఉంటున్న తన బాబాయ్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా.. కాకానినగర్ హైవేపై వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు మృతి చెందాడు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగేశ్వరరావు దంపతుల మృతి వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications