తల్లికి కొరవి పెట్టని కొడుకు: గ్రామ బహిష్కరణ (ఫొటో)
వరంగల్: జిల్లాలోని హన్మకొండ మండలం పైడిపల్లిలో తల్లికి తల కొరవి పెట్టకుండా వెళ్లిపోయిన ఆమె కుమారుడు కన్నెబోయిన యాదగిరి, ఆయన భార్య ఇంద్రను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు మహిళా సంఘం పేరిట శుక్రవారం గ్రామంలో బ్యానర్లు వెలిశాయి. కాగా సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎనిమిది రోజుల క్రితం గ్రామంలో కన్నెబోయిన ఐలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధురాలి కొడుకు యాదగిరిన తలకొరవి పెట్టాలని గ్రామ పెద్దలు కోరారు. అందుకు యాదగిరి భార్య ఇంద్ర ససేమిరా అంటూ భర్తను అడ్డుకుంది. ఈ క్రమంలో గ్రామస్తులు వారిని చితకబాదారు. ఆ తర్వాత గ్రామం నుంచి వెళ్లిపోయిన యాదగిరి దంపతులు గ్రామానికి రాలేదు.

ఈ సమయంలోనే శుక్రవారం యాదగిరి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తున్నామని మహిళా సంఘం పేరిట ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా మృతురాలికి ఆమె కూతురే దహన సంస్కారాలు చేసింది.
నీటి తొట్టిలో పడి చిన్నారి దుర్మరణం
వరంగల్ జిల్లాలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి దేవస్థానం సమీపంలో బొంగు లకిత (3) అనే చిన్నారి శుక్రవారం సాయంత్రం నీటి తొట్టిలో పడి దుర్మరణం పాలైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విషాధంలో మునిగిపోయారు. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం.. రాజు, రజిత దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్లారు.
ఈ దంపతులకు లకితతోపాటు ఓ బాబు ఉన్నారు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న లకిత బొమ్మ నీటి తొట్టిలో పడగా దాని కోసం వెళ్లి అందులో పడిపోయింది. దీంతో ఊపిరాడక పాప చనిపోయింది. కూలీ పనికి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు పాప కనిపించకపోవడంతో అంతటా వెదికారు. నీటి తొట్టిలో నిర్జీవంగా పడివున్న పాపను చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications