ఏపీలో సినీనటి సమంతకు గుడి కట్టిన వీరాభిమాని
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఓ వీరాభిమాని గుడి కడుతున్నాడు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంత పై వీరాభిమానం తో ఏకంగా గుడినే నిర్మిస్తున్నాడు. గతంలో సమంత కోసం, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత త్వరగా కోలుకోవాలని అనేక దైవ క్షేత్రాలు తిరిగిన వీరాభిమాని ఇప్పుడు ఏకంగా ఆమె విగ్రహాన్ని చేయించి గుడినే కడుతున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగింది. ఏం మాయ చేశావే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తనదైన శైలిలో దూసుకుపోయింది. ఇప్పటికీ ఆమెకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సమంతకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు.

వ్యక్తిగత జీవితంలో నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత అనేక కారణాలతో నాగ చైతన్యకు దూరంగా ఉంటున్న సమంత మానసికంగానూ, శారీరకంగానూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. సమంత మయోసైటిస్ తో బాధ పడుతుంది. ఇక ఈ క్రమంలో ఆమె త్వరగా కోలుకోవాలని తిరుపతి, నాగపట్నం, కడప దర్గా, చెన్నై లోని దైవ క్షేత్రాలను సందర్శించాడు సందీప్.

ఇక ప్రస్తుతం ఏకంగా తన ఇంట్లోనే సమంతకు గుడి కట్టి అందులో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. సమంత కోసం కట్టిన గుడి ని సమంత పుట్టినరోజు ఏప్రిల్ 28 వ తేదీన ఆమెకు కానుకగా ప్రారంభించనున్నాడు సందీప్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళనాడు రాష్ట్రంలో సినీ తారలు ఖుష్బూ, జయలలిత వంటి వారికే గుళ్ళు కట్టి పూజలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సమంతకు గుడి కట్టి ఓ అభిమాని తన అభిమానాన్ని చాటుకోవటం ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications