15ఏళ్ల బాలికపై 3రోజులపాటు గ్యాంగ్‌రేప్: కర్రలతో కొట్టి, చిత్రహింసలు
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదిహేనేళ్ల బాలికను మూడు రోజులపాటు గదిలో నిర్బంధించిన ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయవాడలోని మాచవరంలో చోటు చేసుకుంది.
మాచవరం కార్మికనగర్ కొండ ప్రాంతానికి చెందిన బాలికను గుణదలకు చెందిన యువకులు మాయమాటలతో మభ్యపెట్టి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం విజయవాడలోని కార్మికనగర్ కొండ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇటీవల భర్త చనిపోవడంతో ఇళ్లలో పనికి వెళ్లే బాలిక తల్లి.. తన పదిహేనేళ్ల కుమార్తెను చదువు మాన్పించి ఇంటి వద్దనే ఉంచింది.

కాగా, మంగళవారం గుణదల చర్చికి వెళ్లిన బాలికను పరిచయస్తుడైన యువకుడు బెత్లెహాంనగర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు. ఆమెను సాయంత్రం వరకు తన వద్దనే ఉంచుకొని ఇంటి వద్ద దింపిన యువకుడు మరుసటి రోజు తిరిగి ఆమెను గదికి రప్పించాడు. ఆ తర్వాత తన నలుగురు స్నేహితులతో కలిసి జక్కంపూడిలోని ఖాళీగా ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఫ్లాట్ కు తీసుకెళ్లాడు. వారు చెప్పినట్టు చేసేందుకు బాలిక నిరాకరించడంతో కర్రతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు.
అనంతరం ఆమెకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన వీరు నేరుగా గుణదలలోని తమ గదికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమెను గదిలోనే నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. మరోపక్క కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లి తమ బంధువుల ఇళ్లకు వెళ్లి వెదుకులాట ప్రారంభించింది.
ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను ఆ యువకులు శనివారం ఆమె ఇంటి వద్ద దించి పరారవుతుండగా, సమీపంలోని బంధువులు గమనించి ముగ్గురినీ పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించగా మరో ఇద్దరు పరారయ్యారు.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం నక్కలపాలెం గ్రామానికి చెందిన నిందితులు గుణదలలో గదులు అద్దెకు తీసుకొని ఉంటూ ప్రసాదంపాడులోని చాక్లెట్ తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications