నాటుసారా తాగించిన మహిళ: మూడేళ్ల చిన్నారి మృతి
కర్నూలు: జిల్లాలోని డోన్ మండలం పెదమల్కాపురంలో దారుణం చోటుచేసుకుంది. మౌనిక అనే మూడేళ్ల చిన్నారికి ఓ వ్యాపారి నాటుసారా తాగించడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి బోడెమ్మ అలియాస్ సాలమ్మ అనే మహిళ తన ఇంటి వద్ద నాటుసారా సేవిస్తుండగా.. అక్కడే ఆడుకుంటున్న చిన్నారి మౌనికకు కూడా సారా తాగించింది. దీంతో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది.
వెంటనే మౌనికను బంధువులు డోన్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ చిన్నారి మౌనిక మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సిఎం బందోబస్తు వాహనం బోల్తా: మహిళ మృతి
ఏపి సిఎం చంద్రబాబునాయుడు బందోబస్తుకు వచ్చిన ఓ పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం యడ్లగూడెం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది.
సీఎం బందోబస్తు కోసం వచ్చిన పోలీసు జీపు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఏఎస్ఐతో సహా మరొకరికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం. గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కారు బీభత్సం: 10 మందికి గాయాలు

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాపట్ల రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కుటుంబకలహాలే వారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మృతులు బాపట్ల మండలం చెరువు జమ్ముల పాలెం గ్రామానికి చెందిన నాగ వర్తులమ్మగా గుర్తించారు. అత్త, ఆడపడచు వేధింపులే కారణమని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది.












Click it and Unblock the Notifications