పెళ్లాడతానని మోసం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా
కరీంనగర్: నాలుగేళ్లుగా ప్రేమించుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించాడో ప్రబుద్ధుడు. ఇందుకు ఆగ్రహించిన ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకునే వరకు తన ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని ధర్మారం మండలం కొత్తూరులో చోటు చేసుకుంది.
శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కొత్తూరు గ్రామానికి చెందిన నితిన్, మౌనికలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక నితిన్‌ను కోరగా అతను ముఖం చాటేశాడు. దీంతో ఆమె శుక్రవారం ప్రియుడి ఇంటిముందు బైఠాయించింది.

విషయం తెలుసుకున్న నితిన్, అతని తల్లిదండ్రులు ఇంటి నుంచి జారుకున్నారు. కాగా, నితిన్ పెళ్లి చేసుకునే వరకు వదిలేది లేదని, అవసరమైతే అతని ఇంటిముందే ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడనని ప్రియురాలు చెబుతోంది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచి ఆమెతోపాటు ధర్నాకు దిగాయి.
భవనం కూలి 10మంది కూలీలకు గాయాలు
హైదరాబాద్ నగరంలోని చంద్రాయణగుట్ట హఫీస్‌బాబానగర్‌లో ఓ భవనం కూలింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం డీఆర్‌డీఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు.












Click it and Unblock the Notifications