అమ్మాయిని కాపాడిన 6గురు యువకులు: రేప్ చేస్తారేమోనని పోలీసులకు పట్టించారు

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ఇటీవల జరుగుతున్న పలు ఘటనలు మంచి వాళ్లను కూడా చెడ్డ వాళ్లుగా చూసేలా చేస్తున్నాయి. తాజాగా, ఓ ఆరుగురు యువకులు ఓ అమ్మాయిని కాపాడి ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే, వారు ఆ అమ్మాయిని అపహరించి అఘాయిత్యానికి పాల్పడతున్నారనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు మరికొందరు మంచివాళ్లు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది.

పలమనేరులో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని గుడియాత్తం రోడ్డు క్రాస్‌ వద్ద జాతీయ రహదారిపై చిత్తూరు వైపు నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరుగురు యువ వస్త్ర వ్యాపారులు తాము ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును ఆపారు. అందులో నుంచి ఆ ఆరుగురు యువకులు, వారితోపాటు ఉన్న ఓ యువతి కారు దిగి టీ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ యువకులు టీ తాగిన తిరిగి కారు వద్దకు వెళ్లారు.

A girl saved by six youths

కాగా, అప్పటి వరకు వారి వెంట మౌనంగా ఉన్న ఆ యువతి ఉన్నట్టుండి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆ యువకులు ఆ అమ్మాయిని పట్టుకొని బలవంతంగా కారులో ఎక్కించారు. ఈ ఘటన చూసిన స్థానికులు అనుమానించి వెంటనే కారును చుట్టుముట్టి పోలీసులకు అప్పగించారు. పోలీస్‌ స్టేషన్ లో యువకులు చెప్పిన వివరాలతో అసలు విషయం తెలిసింది.

ప్రియాంక కండేల్‌ అనే యువతి చండీఘర్‌లో మంగళవారం డెహ్రడూన్ నుంచి మధురై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒంటరిగా ఎక్కింది. ఈమె చండీఘర్‌కు చెందిన ప్రీతిచంద్‌ కుమార్తె. ఇదే రైలులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌ లో మహ్మద్‌ జుబేల్‌, మహ్మద్‌షావనార్‌, ఘయా జుద్దీన్ మరో ముగ్గురు వస్త్ర వ్యాపారులు ఎక్కారు. వీరు కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌లో వస్త్ర వ్యాపారం చేసేవారు. ప్రియాంక ప్రయాణిస్తున్న బోగీలోనే ఎక్కిన వస్త్ర వ్యాపారులు కొద్ది గంటల ప్రయాణం తరువాత ప్రియాంకను వారు పలకరించి ఆమె స్వస్థలం చండీఘర్‌ అని, ఆమె వద్ద ఉన్న ఆధార్‌ కార్డు ద్వారా ఆమె తండ్రి ప్రీతిచంద్‌ అని తెలుసుకున్నారు.

మరికొద్దిసేపటి తరువాత ప్రీతిచంద్‌ ఫోన్ నెంబర్‌ కూడా తీసుకొని ఆయనతో వ్యాపారులు మాట్లాడి ప్రియాంక ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేసిందని ఆమె మానసిక స్థితి సరిగాలేదని తెలుసుకున్నారు. తాము ముళ‌బాగల్‌కు వ్యాపారం నిమిత్తం వెళుతున్నామని చెప్పడంతో ప్రీతిచంద్‌ తాను బెంగుళూరు విమానాశ్రయానికి వస్తానని తన బిడ్డను విమానాశ్రయం వద్ద అప్పగించాలని ఆ యువకులను కోరాడు. దీంతో యువకులు.. నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో బుధవారం తెల్లవారుజామున దిగారు.

ప్రియాంకకు నచ్చజెప్పి తమ వెంట బెట్టుకుని అక్కడే ఇన్నోవా కారును అద్దెకు మాట్లాడుకుని బెంగుళూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో బుధవారం ఉదయం పలమనేరులో టీ తాగేందుకు వాహనం నిలిపారు. టీ తాగి తిరిగి వాహనం ఎక్కే సమయంలో ఆ అమ్మాయి పారిపోవడానికి ఉపక్రమించడంతో పట్టుకున్నారు. ఇది చూసిన స్థానికులు ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేసేందుకే తీసుకెళ్లుతున్నారేమో అనే అనుమానంతో వారిని పోలీసులకు అప్పగించారు.

విషయం తెలుసుకున్న పలమనేరు పోలీసులు ప్రియాంక తండ్రి ప్రీతిచంద్‌కు ఫోన్ చేసి ఆయన, కుటుంబ సభ్యులు బెంగుళూరు విమానాశ్రయం వద్ద ప్రియాంక కోసం వేచి ఉన్నట్లు తెలుసుకున్నారు. ప్రియాంకను ప్రీతిచంద్‌తో ఫోన్లో మాట్లాడించారు.

ఆ తర్వాత ప్రీతిచంద్‌ను, కుటుంబసభ్యులను పలమనేరుకు రావాలని పోలీసులు సూచించడంతో బుధవారం మధ్యాహ్నం ప్రీతిచంద్‌, కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకొన్నారు. పలమనేరు ఏఎస్‌ఐ జేపీరావు ప్రియాంకను తండ్రి ప్రీతిచంద్‌కు అప్పగించారు. ఆ యువతిని భద్రంగా తల్లిదండ్రుల వద్దకు ఆ వ్యాపారులను పలమనేరు పోలీసులు అభినందించారు. తమ కుమార్తెను క్షేమంగా తమ వద్దకు చేర్చినందుకు ప్రియాంక తల్లిదండ్రులు ఆ యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl saved by six youths, belongs to Uttar Pradesh. And the girl reached her parents in Palamaneru, Chittoor district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి