ప్రాణం తీసిన ప్రేమ: ప్రియుడి ఇంటికెళ్లిన ధనలక్ష్మికి ఏమైంది?

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. అతని మాటలు నమ్మిన యువతి అతని వెంట నడిచింది. కనీ, పెంచీ పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలేసి ప్రియుడి ఇంట్లో అడుగుపెట్టింది. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆమెకు ప్రియుడితోపాటు అతడి తల్లిదండ్రుల నుంచి వేధింపులే ఎదురయ్యాయి. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కన్నవారికి తీరని శోకం మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే.. అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ కడపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కడపాలెం గ్రామానికి చెందిన ఉమ్మిడి కాసుబాబు(17), మైలపల్లి ధనలక్ష్మి(16) ప్రేమించుకున్నారు. నెల రోజుల క్రితం ఇద్దరూ గ్రామాన్ని వదలి వెళ్లిపోయారు. ఐదు రోజుల తరువాత మళ్లీ గ్రామానికి వచ్చారు.

A girl suspicious death in Visakhapatnam district on Sunday.

అప్పటి నుంచి ధనలక్ష్మి, కాసుబాబు ఇంట్లోనే ఉంటోంది. కాగా, ఇరువురి తల్లిదండ్రులకు చేపల వేటే జీవనాధారం. కాసుబాబుకి ఇద్దరు అక్కలు ఉండటంతో, అతనికి వివాహం చేయడం ద్వారా వచ్చే కట్నం డబ్బులతో కుమార్తెలకు వివాహం చేయాలని భావించారు. కానీ కాసుబాబు, తాను ధనలక్ష్మిని ప్రేమించానని చెప్పి ఇంటికి తీసుకురావడం వారికి మింగుడుపడలేదు. దీంతో వారు ధనలక్ష్మి తల్లిదండ్రులు పోలయ్య, ముత్యాలమ్మను సంప్రదించి, 6లక్షల రూపాయల కట్నం ఇస్తే కాసుబాబుతో వివాహం జరిపిస్తామని చెప్పారు.

తమకు అంత స్థోమత లేదని, లక్షన్నర రూపాయలు ఇస్తామని ధనలక్ష్మి
తల్లిదండ్రులు తెలిపారు. దీనికి కాసుబాబు తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం కాసుబాబు తన ఇంటి గుమ్మం వద్ద రోదిస్తుండగా, ఇరుగుపొరుగు వారు ఆరా తీశారు. ధనలక్ష్మి ఇంటిలో ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.

వెంటనే తనకు తల తిరుగుతున్నదని చెప్పి కాసుబాబు అచ్యుతాపురం పీహెచ్‌సీకి వెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షించి, అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, తన కుమార్తెను కాసు బాబు, అతని తల్లిదండ్రులు కొట్టి చంపేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, పోలీసులు హత్యగా భావించకుండా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.

ధనలక్ష్మి మృతి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమె మృతి చెందినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారే గానీ.. ధనలక్ష్మి మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టానికి పంపించలేదు.

దీంతో స్థానికులు నిలదీయడంతో సాయంత్రం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం కాసుబాబు తల్లిదండ్రులు, బంధువులు పరారయ్యారు. సంఘటన స్థలానికి స్థానిక ఎస్సై దీనబంధు వెళ్లి పరిశీలించారు. ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl suspicious death in Visakhapatnam district on Sunday.
Please Wait while comments are loading...