మతాలు వేరని పెద్దల నిరాకరణ: రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
చిత్తూరు: ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన శనివారం తిరుపతిలో వెలుగుచూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని గణపవరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో జ్యోతి శశికుమార్(23), స్టెల్లామేరీ(22) బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు.
కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు.. ప్రేమ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. మతాలు వేరుకావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. మనస్తాపం చెందిన జ్యోతి శశికుమార్, స్టెల్లామేరీ రెండు రోజుల క్రితం గుంటూరు నుంచి పారిపోయి తిరుపతికి చేరుకున్నారు.

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించని నేపథ్యంలో ఒకరిని విడిచి ఒకరు జీవించలేమని భావించిన ఆ ప్రేమజంట.. శుక్రవారం అర్ధరాత్రి శ్రీపద్మావతి పాలిటెక్నిక్ కళాశాలకు సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్యకు యత్నించారు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం ఉదయం రైల్వే పట్టాలపై మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న వారు.. మృతుల ఆచూకీ కోసం ప్రయత్నించగా శశికుమార్ జేబులో సెల్‌ఫోన్ కనిపించింది. దాని ఆధారంగా ఇద్దరి చిరునామాను గుర్తించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications