పోలీస్‌స్టేషన్‌కు మిస్డ్‌కాల్ ప్రేమ కథ: ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్/కరీంనగర్: మిస్ట్ కాల్‌తో మొదలైన ఓ ప్రేమ కథ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే వివాహమైన వ్యక్తి ఓ మైనర్ అమ్మాయిని ప్రేమలోకి దించి వివాహం చేసుకుంటానని తీసుకొచ్చాడు. కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో వారిద్దరూ పోలీస్ ష్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా, వారి కళ్లుగప్పి వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. వెంటనే వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ప్రేమ జంట ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని మామడ మండలం పొన‌్కల్ గ్రామానికి చెందిన ఓ బాలిక (15)కు అనుకోకుండా సెల్‌ఫోన్ మిస్డ్ కాల్ ద్వారా కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌కు చెందిన టేకులపల్లి రాజేందర్‌కు(32) ఏడాది క్రితం పరిచయమైంది. అప్పటికే పళ్లై ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన రాజేందర్ ప్రేమ పేరుతో బాలికను తన వైపు తిప్పుకున్నాడు.
రాజేందర్ ఆమెతో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికకు గతంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ సంరక్షణలో పెరుగుతూ 10వ తరగతి వరకు చదువుకుందని చెప్పారు. ఈ క్రమంలో అమ్మమ్మ బాలికకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించిందని, ఈ విషయం ప్రియుడు రాజేందర్‌కు తెలపడంతో ఆమెను తనతో వచ్చేయమని అన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఏప్రిల్ 14వ తేదీన బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది.

అమ్మమ్మ 19వ తేదీ వరకు వెతికి కనిపించకపోవడంతో అదే రో జున మామడ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు బాలిక, రాజేందర్ వెతకడం ప్రారంభించారు. రాజేందర్ సొంత ఊరు గోధూరులోని అతని ఇంట్లోనే ఇద్దరు ప్రేమికులు కనిపించారు. దీంతో వారిని ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు పోలీసులు.
వారికి సిఐ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు స్టేషన్‌లోనే ఉండాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతలోనే వారు వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. దీంతో వెంటనే వారిని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఖానాపూర్ ఎస్‌ఐ శాంతారాం కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ప్రేమికులిద్దరూ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ తరుణ్ జ్యోషీ స్వయంగా ఖానాపూర్‌కు వచ్చి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications