ముంచుకొస్తున్న మరో ముప్పు, కుండపోత వర్షాలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే సమయంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో రానున్న అయిదు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వాయుగుండం తీరం దాటటంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నెల 24 ఆదివారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ కారణంగా రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్ర తో పాటుగా కోస్తా, సీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు చేసారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 3.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో కొనసాగుతోంది.

ఇక, ప్రకాశం బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్కులపైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి ఐదున్నర లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అటు గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సోమవారం రాత్రికి నీటిమట్టం 31.15 మీటర్లకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భారీ వర్షాలతో అధికారిక యంత్రాంగం అప్రమత్తం అయింది.












Click it and Unblock the Notifications