ముంచుకొస్తోంది, నేడు- రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఈ రోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం గోదావరితో పాటుగా గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ రోజు పిడుగుల తో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అటు తెలంగాణలోని పలు జిల్లాలకు తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని అధికారులు అలర్ట్స్ జారీ చేసారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాలకు వర్ష ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రోజు.. రేపు 30-40 కిమీ వేగంతో గాలులతో పాటుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. దక్షిణకోస్తా, తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వానలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడగా.. పలుచోట్ల ముసురు పడింది. కాగా, అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 10.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. చెరువులు, వాగులు పొంగి పొర్లాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల-గోపన్నగూడెం మధ్యన వాగులో ఏపీకి చెందిన ఇద్దరు మహిళా కూలీలు కొట్టుకుపోయి మృతి చెందారు.












Click it and Unblock the Notifications