ఖతర్నాక్ క్రైమ్ కథ : భార్యను చంపి సూట్ కేస్ లో కుక్కి కాల్చేసి, డెల్టా ప్లస్ తో చనిపోయిందని చెప్పిన భర్త !!
తిరుపతిలో ఓ భర్త భార్యను దారుణంగా హతమార్చి, గుట్టుచప్పుడు కాకుండా తగలబెట్టి, తన భార్య డెల్టా ప్లస్ కరోనా వైరస్ తో బాధపడుతూ మృతి చెందిందని, తనకు మృతదేహాన్ని కూడా ఇవ్వకుండా, ఆసుపత్రి వర్గాలు మృతదేహాన్ని దహనం చేసినట్లుగా కట్టుకథ అల్లాడు. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న భార్యను హతమార్చిన సదరు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఎస్‌విఆర్‌ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో సూట్ కేసులో కాలిన మృతదేహం
ఇక అసలు విషయానికి వస్తే తిరుపతిలో ఐదు రోజుల క్రితం ఎస్‌విఆర్‌ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక సూట్ కేస్ లో సగం కాలిపోయిన మృతదేహం పోలీసులు గుర్తించారు. సూట్‌కేస్‌లో మృతదేహాన్ని తీసుకు వచ్చి అక్కడ తగలబెట్టినట్లుగా గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో మృతురాలు హైదరాబాద్‌లో పని చేసే 27 ఏళ్ల టెక్కీగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆమె భర్త, ఆమెను చంపి పారిపోయాడని భావిస్తున్న పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.

సీసీ టీవీ ఫుటేజ్ తో భర్తే హంతకుడని తేల్చిన పోలీసులు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆసుపత్రి చుట్టూ ఉన్న సిసిటివి ఫుటేజీని పరిశీలించారు. అందులో భర్తను హంతకుడిగా గుర్తించారు. నిందితుడు శవాన్ని డంప్ చేయడానికి ఒక క్యాబ్ డ్రైవర్ సహాయం తీసుకున్నట్లుగా గుర్తించిన పోలీసులు, క్యాబ్ డ్రైవర్ ను పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. మృతురాలు 27 సంవత్సరాల చిత్తూరులోని రామసముంద్రం కు చెందిన భువనేశ్వరి అని, ఆమె హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారని తేలింది.

భార్యాభర్తల మధ్య ఘర్షణ .. టెక్కీ భార్యను చంపేసిన భర్త
ఆమె 2019 లో కడపకు చెందిన శ్రీకాంత్ రెడ్డిని వివాహం చేసుకుంది. వారికి 18 నెలల కుమార్తె ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో శ్రీకాంత్ ఉద్యోగం కోల్పోయిన తరువాత ఈ జంట తిరుపతికి మకాం మార్చారు. ఈ క్రమంలో తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్న శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఇది తరచూ భార్యాభర్తల మధ్య చిచ్చుకు కారణమైంది. జూన్ 22-23 మధ్య రాత్రి, భార్యాభర్తలు ఇరువురి మధ్య మళ్ళీ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కోపంతో ఊగిపోయిన శ్రీకాంత్ భువనేశ్వరిని హతమార్చాడు. ఇక ఈ విషయం బయటకు రాకుండా పెద్ద ప్లాన్ చేసాడు.

భార్య మృతదేహాన్ని సూట్ కేస్ లో పెట్టి తగలబెట్టిన భర్త .. డెల్టా ప్లస్ వల్ల చనిపోయిందని కథ
భార్య మృతదేహాన్ని ఒక సూట్ కేసు లో కుక్కి ఒక టాక్సీని అద్దెకు తీసుకొని మృతదేహాన్ని ఆసుపత్రి కాంపౌండ్‌లో పడేశాడు. తరువాత, అతను తిరిగి సంఘటన స్థలానికి చేరుకుని సూట్‌కేస్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తరువాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు ,మిత్రులకు తన భార్య కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ బారినపడిందని, మృతి చెందిందని కట్టుకథ చెప్పాడు. ఆసుపత్రి వర్గాలు కనీసం మృతదేహాన్ని కూడా ఇవ్వలేదని, సుపత్రి నుండి మృతదేహాన్ని నేరుగా దహనం చేయడానికి తీసుకెళ్లారని నమ్మించాడు.

పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటకు .. నిందితుడి కోసం గాలింపు
సగం కాలిపోయిన మహిళ మృతదేహాన్ని ఆసుపత్రి కాంపౌండ్లో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పరారీలో ఉన్న శ్రీకాంత్‌ను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కరోనా సమయం కాబట్టి భార్యను చంపి శవాన్ని మాయం చేసి కరోనా మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications