తిరుమలలో భక్తుల కోసం కొత్తగా శ్రీ భాగ్య గెస్ట్ హౌస్: రూ. 26 కోట్లు, ప్రత్యేకతలు.. !!
Tirumala: ప్రఖ్యాత పుణక్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. వేలాదిమంది శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. శనివారం నాడు 79, 791 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,911 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.73 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

కాగా- తిరుమలలో కొత్తగా నిర్మించిన మరో అతిథి గృహం అందుబాటులోకి వచ్చింది. ఆదివారం నాడు తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి దీన్ని ప్రారంభించారు. ఈ అతిథి గృహాన్ని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు, టీటీడీ తమిళనాడు స్థానిక సలహా కమిటీ ఛైర్మన్ ఏజే శేఖర్ నిర్మించారు. దీనికి శ్రీ భాగ్య అని పేరు పెట్టారు.
ఈ అతిథి గృహంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన 12 సూట్ రూమ్‌లు ఉన్నాయి. వీటిని తిరుమల సందర్శించే భక్తుల వసతి కోసం తిరుపతి ట్రస్ట్ కేటాయించనుంది. కాటేజ్ డొనేషన్ పథకం కింద సుమారు 26 కోట్ల రూపాయలతో ఈ భవనం శ్రీ పద్మావతి అతిథి గృహ ప్రాంతంలో నిర్మితమైంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా కర్ణాటకలోని ములబాగిల్‌లో ఉన్న శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి శ్రీ సుజయేంద్ర తీర్థ స్వామిజీ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications