పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది. 2500 ఏళ్ళ పాటు నిలిచే అద్భుతమైన కట్టడం అయిన అయోధ్య రామాలయానికి ఈ నెల 22వ తేదీన జరగనున్న విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆయనకు రావాలని ఆహ్వానం అందింది. అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవానికి ఆయనకు ఆహ్వానం అందింది.
దీనికి సంబంధించి ఆహ్వాన పత్రికను ఆరెస్సెస్ ప్రాంత సంపర్క్ ప్రాముఖ్ ముళ్ళపూడి జగన్ జనసేనాని పవన్ కళ్యాణ్ కు అందించారు.అంతేకాదు అయోధ్యలో నిర్మితమైన రామాలయ విశేషాలను, రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించిన విశేషాలను పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు. ఈ భేటీలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఆరెస్సెస్ కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 22వ తేదీన జరగనున్న అయోధ్య విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ విదేశాల నుండి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి రావాలని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రముఖులకు ఆహ్వానాలను పంపుతుంది.
ఇదిలా ఉండగా అయోధ్య రామమందిర నిర్మాణం ప్రారంభించగానే పవన్ కల్యాణ్ రూ.30 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌కు అందించారు. ఇక తాజాగా ఆయన ఈ మహత్కార్యానికి వెళ్లేందుకు ఆహ్వానాన్ని అందుకున్నారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న యూపీ సర్కార్ అందుకు తగిన ఏర్పాట్లను చేస్తుంది.
అయితే దక్షిణాది సినీ పరిశ్రమ నుండి కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్, పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఇన్విటేషన్ లు రావటం గమనార్హం. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో ఈ రామాలయ నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామాలయం నిలవనుంది. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు మేళవింపుగా అయోధ్య రామాలయం నిలుస్తుంది.












Click it and Unblock the Notifications