తిరుమల నెయ్యి ట్యాంకర్ బోల్తా
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 82,838 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,006 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.94 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో31 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది.
కాగా- శ్రీవారి లడ్డూ తయారీ కోసం తిరుమలకు నెయ్యిని తీసుకు వెళ్తున్న ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ కు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. కడప జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

21 వేల లీటర్ల నెయ్యితో పుణే నుండి తిరుమలకు బయలుదేరిన ట్యాంకర్ అది. నేడు తిరుమలకు చేరాల్సి ఉంది. ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైంది. జిల్లాలోని కొండాపురం మండలంలో గుండ్లూరు సమీపంలో జాతీయ రహదారి 67పై మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న నెయ్యి రోడ్డు మీద ఒలిగిపోయింది. ట్యాంకర్ నుంచి పెద్ద మొత్తంలో నెయ్యి కారిపోతోండటంతో స్థానికులు బిందెలు, బకెట్లు, క్యాన్లతో ఎగబడ్డారు. వాటిని నింపుకెళ్లారు.
ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే కొండాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ డ్రైవర్, క్లీనర్ ను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమాచారాన్ని డ్రైవర్, క్లీనర్ కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications